అక్రమార్కుల అడ్డదారులు

ABN , First Publish Date - 2022-12-05T00:56:30+05:30 IST

పామాయిల్‌ మొక్కల డిమాండ్‌ నేపథ్యంలో దళారుల అవతారమెత్తిన కొందరు అక్రమాలకు తెరలేపారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొక్కలను ఏపీకి తరలించేందుకు ప్రయత్నించిన వైనం వెలుగులోకి వచ్చింది.

అక్రమార్కుల అడ్డదారులు
మొక్కల విక్రయ సమయంలో వ్యక్తుల లావాదేవీలు (ఫైల్‌)

రాజకీయ అండతో తప్పించుకునేందుకు యత్నం

పామాయిల్‌ మొక్కల వ్యవహారంలో తప్పించుకున్న కీలక సూత్రధారి

సత్తుపల్లి, డిసెంబరు 4: పామాయిల్‌ మొక్కల డిమాండ్‌ నేపథ్యంలో దళారుల అవతారమెత్తిన కొందరు అక్రమాలకు తెరలేపారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొక్కలను ఏపీకి తరలించేందుకు ప్రయత్నించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కొందరు రైతులు ఏపీకి పామాయిల్‌ మొక్కలతో వెళుతున్న లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటనలో వేంసూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నా.. సత్తుపల్లి మండలానికి చెందిన వ్యక్తినే కొందరు లక్ష్యంగా చేశారన్నా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగాం నుంచి గత నెల 26 తెలంగాణాలోని ఒక గ్రామానికి చేరాల్సిన మొక్కలు ఆంధ్రప్రదేశకు తరలిపోతున్న సమాచారంతో లారీని పట్టుకున్నారు.

లారీ ఎవరు మాట్లాడారు..

ఏపీకి తరలిపోతున్న లారీని ఎవరు మాట్లాడారనే విషయం బహిరంగా రహస్యమే అయినా దాన్ని కిరాయికి తీసుకున్నవేంసూరు మండలానికి చెందిన వ్యక్తి తనపై చర్యలు తీసుకోకుండా ముందు జాగ్రత్తగా రాజకీయ నాయకులను ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ లారీని పోలీసులు స్వాధీనం చేసుకొని జనగాం తరలించడంతో దాన్ని కిరాయికి తీసుకున్న వ్యక్తి తనకు వెయిటింగ్‌ చార్జి కూడా ఇవ్వాలని, తమపై కేసు అయితే అతడిదే బాధ్యత అని ఆ వాహన యజమాని యూనియన నాయకులను వెంటబెట్టుకుని వచ్చి సత్తుపల్లి పోలీస్టేషనలో చెప్పారు. అయితే పోలీసులు ఆ లారీని కిరాయికి తీసుకున్న వ్యక్తిని కేవలం విచారించారే తప్ప అక్రమాలకు బాధ్యుడిని చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండతోనే అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఈ మేరకు వారు సఫలమయ్యారని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు లారీని పట్టుకున్న మరుసటి రోజు సత్తుపల్లి మండలానికి చెందిన వ్యక్తి అక్రమాలకు బాధ్యుడు అంటూ కొందరు ఫిర్యాదు చేసినా.. వేంసూరు మండలానికి చెందిన వ్యక్తి పేరు ఫిర్యాదులో రాయకపోవటం చర్చనీయాంశమైంది. మొత్తంగా జనగామ నుంచి ఏపీకి పామాయిల్‌ మొక్కల అక్రమ రవాణా విషయంలో అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయని, అక్రమార్కులు క్లీనచిట్‌తో బయట పడేందుకు ప్రయత్నాలు చేయటం, రాజకీయ నాయకులు కూడా తమ వంతు సహకారం అందిస్తూ ఉండటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-12-05T00:56:31+05:30 IST