నా అనేవారు లేక.. సాయం అందక..

ABN , First Publish Date - 2022-11-19T00:58:55+05:30 IST

ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాలకు ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపు రూ.50వేలు అందిస్తామని ప్రకటించి. ఇది జరిగి ఏడాది దాటుతున్నా సాయం అందక, సమాచారం లేక దరఖాస్తు దారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

నా అనేవారు లేక.. సాయం అందక..

ప్రభుత్వ చేయూత కోసం కొవిడ్‌ మృతుల కుటుంబాల ఎదురుచూపు

దరఖాస్తు చేసి ఏడాది కావస్తున్నా అతీగతీ లేని సాయం

ఖమ్మం జిల్లాలో 2500పైగా దరఖాస్తుదారులు..

1909 మంది అర్హులుగా గుర్తింపు

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 18: ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాలకు ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపు రూ.50వేలు అందిస్తామని ప్రకటించి. ఇది జరిగి ఏడాది దాటుతున్నా సాయం అందక, సమాచారం లేక దరఖాస్తు దారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ తమకు పరిహారం ఎందుకు రావడంలేదో కారణాలు తెలియక కొందరు, దరఖాస్తులు తిర స్కరించారని తెలుసుకుని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమం లో ఇప్పటి వరకు అతికొద్ది మంది దరఖాస్తు దారులకు మాత్రమే కొవిడ్‌ సాయం అందినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 2500మందికి పపైగా పైగా దరఖాస్తు చేసుకోగా 1909మంది అర్హులుగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఈ ఏడాది జనవరి నుంచి సాయం డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత తహసీల్దార్లు, డీఎంహెచవో, డీసీహెచవోలు సభ్యులుగా ఉన్న కమిటీలు పరిశీలించి సాయం కోసం ఎంపిక చేసి ప్రభుత్వ లాగినలో ఉంచారు. కానీ నేటికీ ఆ దరఖాస్తు దారులకు సాయం అందలేదు. ఖమ్మం జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి మొదటి, రెండు విడతల్లో అధికంగానే మరణాలు సంభవించాయి. మొదటి విడతలో 210 మంది, రెండో విడతలో 1185 మంది మృతిచెందినట్టు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం రెట్టింపు మరణా లు జరిగినట్టు తెలుస్తోంది. అప్పట్లో వైరస్‌ భయం, తీవ్రత కారణంగా మరణాల లెక్కలు వెల్లడించేందుకు జిల్లా యంత్రాంగం సాహసించలేదు. ఇప్పుడు సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇదే అడ్డంకిగా మారింది. అప్పట్లో కుటుంబ సభ్యులు పోయారన్న బాధ, లాక్‌డౌన కారణంగా మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఏమీ తీసుకోలేకపోయారు. సర్కారు సాయంపై అవగాహన లేకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంకొందరి వద్ద సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సాయానికి దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందిస్తారన్న సమాచారంతో ఇప్పటికీ బాధిత కుటుంబాలు రెవెన్యూ, కలెక్టరేట్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరణ ధ్రువీకరణపత్రం, పాజిటివ్‌ రిపోర్టు, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, ల్యాబ్‌ నివేదికలు అధికారుల సంతకాలతో దరఖాస్తులు అందించినా నేటికీసాయం అందడంలేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వివిధ గ్రామాలనుంచి ఇప్పటికీ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారు.

జిల్లా వైద్యాధికారులు ఏమంటున్నారంటే

కొవిడ్‌ సాయం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాం. నిబంధనల మేరకు ఉన్న వాటిని లాగినలో అప్‌లోడ్‌ చేశాం. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వారికి పరిహారం అందే అవకాశం ఉందని చెబుతున్నారు.

పదిరోజుల్లో ముగ్గురిని కోల్పోయి..

ఈమె పేరు గొర్రెముచ్చు విజయశాంతి, ఊరు మధిర. అప్పటివరకు సాఫీగా సాగిన ఈమె కుటుంబంలో కొవిడ్‌ మహమ్మారి చిచ్చురేపింది. విజయశాంతి కుటుంబసభ్యులైన గొర్రెముచ్చు చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, భాగ్యమ్మ గతేడాది మే 12న ఒకరు, 14న ఒకరు, జూన 10న మరొకరు కరోనా కారణంగా మృతిచెందారు. నెలల వ్యవధిలోనే ముగ్గురిని కోల్పోయి నా అనే వారు లేక ఆమె చేయూత కోసం ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం అందిస్తామన్న రూ.50వేల సాయంకోసం దరఖాస్తు చేసుకుని ఆశగా చూస్తోంది. దరఖాస్తు చేసుకుని ఏడాది దాటినా ఇప్పటికీ అతీగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2022-11-19T00:58:55+05:30 IST

Read more