బోరు’తో భారీ దోపిడీ!

ABN , First Publish Date - 2022-11-21T00:03:43+05:30 IST

తెలుగురాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచడంతో పాటు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం- దేవరపల్లి గ్రీనఫీల్డ్‌ జాతీయ రహదారికి పచ్చజెండా ఊపింది. ఏపీ, తెలంగాణను అనుసంధానం చేస్తూ హైదరాబాద్‌, విశాఖ పోర్టుల మధ్య రవాణా వేగంగా జరిగేలా ఈ రహదారికి శ్రీకారం చుట్టారు.

 బోరు’తో భారీ దోపిడీ!

పొలాల్లో బోర్లు లేకున్నా ఉన్నట్టుగా సృష్టి

ఒక్కో దానికి రూ.5లక్షల వరకు డ్రా

మొక్కల పేరిట కూడా అక్రమం

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పరిహారం పక్కదారి?

అధికారులే సూత్రధారులని ఆరోపణలు

తెలుగురాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచడంతో పాటు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం- దేవరపల్లి గ్రీనఫీల్డ్‌ జాతీయ రహదారికి పచ్చజెండా ఊపింది. ఏపీ, తెలంగాణను అనుసంధానం చేస్తూ హైదరాబాద్‌, విశాఖ పోర్టుల మధ్య రవాణా వేగంగా జరిగేలా ఈ రహదారికి శ్రీకారం చుట్టారు. మొదటి ఒకటి, రెండు ప్యాకేజీల్లో ఖమ్మం రూరల్‌ మండలం నుంచి సత్తుపల్లి మండలం తుంబూరు వరకు రహదారి నిర్మాణం జరగనుండగా.. మూడు, నాలుగు ప్యాకేజీల్లో పశ్చిమగోదావరి జిల్లాలో పనులు జరగనున్నాయి. మొదటి రెండు ప్యాకేజీల్లో ఖమ్మం రూరల్‌ పొన్నెకల్లు నుంచి తుంబూరు వరకు 92 కిలోమీటర్లకు సంబంధించి రూ.900కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1350 ఎకరాల భూమిని సేకరించి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ భూములకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): భూ సేకరణకు సంబంధించిన పరిహారంలో కొందరు అధికారులతో చేతులు కలిపిన అక్రమార్కులు అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి ఆయా భూములకు ఎకరానికి ఇంత మొత్తంలో నగదు అన్న కేటాయింపులతోపాటు ఆయా భూముల్లో బోర్లకు సంబంధించి కూడా పరిహారం అందిస్తోంది. అయితే పలు గ్రామాల్లో కొందరు వ్యక్తులు బోర్లు లేకుండానే ఉన్నట్టుగా చూపి పరిహారం పేరుతో పెద్దమొత్తంలో దోపీడీకి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

బోర్లకు విద్యుత మీటర్లున్నాయా?

అయితే డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత ఏయే ప్రాంతాల నుంచి రహదారి వెళ్తుంది? ఎన్ని ఎకరాలు సేకరణ జరగాల్సి ఉంటుంది? ఎవరెవరికి ఎంతమేరకు పరిహారం అందించాలి? లాంటి అంశాలన్నీ రెవెన్యూ అధికారుల ద్వారానే జరుగుతాయి. అయితే ఆయా రెవెన్యూ అధికారులు బోర్లకు పరిహారం అందించాలి అంటే నీటిసరఫరా శాఖ నుంచి తమ పొలాల్లో బోర్లు ఉన్నట్టు లేఖలు పొందాల్సి ఉంటుంది. ఇక్కడే కొందరు వ్యక్తులు లబ్ది పొందినట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు వ్యక్తులు తమ పొలాల్లో బోర్లు లేనప్పటకీ ఉన్నట్టుగా లేఖలు సమర్పించి పరిహారం పొందారన్న ఆరోపణలున్నాయి. అలా ఒక్కో బోరుకు సంబంధించి రూ.5లక్షల వరకు పరిహారం పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా ఒక్కో గ్రామంలో సుమారు పదికి పైగా ఉత్తుత్తి బోర్లుకు సంబంధించిన పరిహారాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తోండగా.. జిల్లా వ్యాప్తంగా రూ. కోట్లలో పక్కదారి పట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా అంత సులువుగా బోర్లకు సంబంధించిన పరిహారం పక్కదారి పట్టిందన్న అంశంపై పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రాత లేకుండా ఇదంతా సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి బోర్లకు సంబంధించి జియోట్యాగింగ్‌ చేసి ఉన్నాయా? లేదా? అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని బోర్లకు సంబంధించి ఎంతెంతమేర నష్టం వాటిల్లుతోందన్న అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వకుండా పరిహారం మంజూరు కాదని, అసలు ఆయా బోర్లకు సంబంధించి విద్యుత మీటర్లు ఉన్నాయా? ఉంటే ఆయా మీటర్లు ఎప్పుడు మంజూరయ్యాయి? ఒకవేళ మీటర్లు లేకుండా బోర్లు ఎలా నడిచాయి? లాంటి అంశాలను పరిశీలిస్తే బోలెడన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. కాగా చివరిలో కొన్ని బోర్లకు సంబంధించిన పరిహారాన్ని జిల్లా అధికారులు నిలిపివేసినట్టు వినికిడి.

మొక్కల్లోనూ మెక్కేశారా?

ప్రభుత్వం పరిహారం అందించే క్రమంలో ఆయా పొలాల్లో ఉన్న పలు మొక్కలకు కూడా కలిపి నగదు ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమచేస్తారు. అయితే జిల్లాలోని కొందరు వ్యక్తులు మామిడి మొక్కలకు అందించే పరిహారంలోనూ మాయచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ వయసున్న మొక్కలకు ఫలసాయం కింద అందించే అధిక పరిహారాన్ని కొందరు అక్రమార్కులు ఎక్కువ కాలం అయిన మొక్కలకు సైతం పొందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొక్కల వయసు తక్కువ చూపి వారికి అందాల్సిన పరిహారం కంటే అదనంగా నగదు డ్రా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దందాలో అధికారులు పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండగా.. కొందరు వ్యక్తులు ఆయా పరిహారం పెంచి ఇప్పించే క్రమంలో కమీషన్ల వ్యవహారం కొనసాగించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతుండగా, ఒకవేళ ఎలాంటి అక్రమాలు జరగని పక్షంలో సంబంధిత పరిహారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల ప్రచారానికైనా చెక్‌ పెట్టాలంటున్నారు.

Updated Date - 2022-11-21T00:03:43+05:30 IST

Read more