విద్యార్థినులకు హెల్త్‌కిట్లు

ABN , First Publish Date - 2022-11-21T00:12:08+05:30 IST

విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శానిటరీ హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థినులకు 33లక్షల అడలోసెంట్‌ హెల్త్‌కిట్ల పంపిణీకి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థినులకు హెల్త్‌కిట్లు

బాలికల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పంపిణీకి ఏర్పాట్లు

ఎనిమితో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అందజేత

ఖమ్మం జిల్లాలో 22వేల మంది విద్యార్థినులు

ఖమ్మం ఖానాపురం హవేలీ, నవంబరు 20: విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శానిటరీ హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థినులకు 33లక్షల అడలోసెంట్‌ హెల్త్‌కిట్ల పంపిణీకి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్న విధంగా అందజేేస ఈ కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

8 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు..

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని 8నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఈ కిట్లు అందజేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరునెలలకోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కిట్లను కొనుగోలు చేయనున్నారు. ఈ కిట్‌లో ఆరు శానిటరీ న్యాప్‌కిన్‌ ప్యాక్స్‌, వాటర్‌ బాటిల్‌, ఒక బ్యాగ్‌ ఉంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో సుమారు 32 శాతం మంది న్యాప్‌కిన్‌ లాగా క్లాత్‌ను వినియోగీస్తున్నారు. దాంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్రప్రభుత్వం హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్లు పంపి ణీ చేయాలని నిర్ణయించింది. ఇవి విద్యార్థినులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతాయని, చదువుపై మరిం త శ్రద్థ చూపించేందుకు అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తున్నది. తద్వారా వారి హాజరు శాతం కూడా పెరిగేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నది.

జిల్లాలో 22 వేల మంది బాలికలకు లబ్థి

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖమ్మం జిల్లాలో 8 నుంచి 12వ తరగతి చదువుతున్న 22వేల మంది విద్యార్థినులకు లబ్థి చేకూరనుంది. 8వ తరగతివిద్యార్థినులు 5604 మంది, 9వ 5636 మంది, 10వ 5546, 11వతరగతి 1253, 12వ తరగతి 1438, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 2955 మందితో కలపి మొత్తం 22వేల 432మంది విద్యార్థినులు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే కిట్లు అందనున్నాయి.

Updated Date - 2022-11-21T00:12:08+05:30 IST

Read more