మరోసారి గోదావరి ఉధృతి

ABN , First Publish Date - 2022-09-13T06:49:56+05:30 IST

మరోసారి గోదావరి ఉధృతి

మరోసారి గోదావరి ఉధృతి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రస్తుతం 48  అడుగుల వద్ద ప్రవాహం

భద్రాచలం, సెప్టెంబరు 12:ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి 12గంటలకు 37 అడుగులున్న గోదావరి నీటిమట్టం సోమవారం ఉదయం 6 గంటలకు 38.7 అడుగులు, మధ్యాహ్నం 12గంటలకు 41.6అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 3గంటలకు తొలి ప్రమాదహెచ్చరిక 43అడుగులను దాటి 43.2 అడుగులకు చేరడంతో భద్రాచలం సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రవాహం సాయంత్రం 6గంటలకు 45.1అడుగులకు చేరుకుంది. రాత్రి 12గంటలకు 48అడుగులకు చేరింది. ఇది మరింతగా పెరిగి రెండో ప్రమాద హెచ్చరికను సైతం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న వరదతో భద్రాచలం వద్ద దేవస్థానం కల్యాణకట్టకు వరద నీరు చేరుకుంది. దీంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.  


అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాంగం సర్వం సిద్దంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారులను వేర్వేరుగా ఆదేశించారు. భద్రాచలానికి బ్యాక్‌ వాటర్‌ ప్రమదం పొంచి ఉండటంతో అందుకు అనుగుణంగా సత్వరమే చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదేశించారు. 


భారీవర్షాలు, వరదలపట్ల అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో టెలికాన్ఫరెన్సలో మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం కార్పొరేషన : రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆదేశించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లతో, ఆయా జిల్లాల పరిధిలోని అధికారులతో మంత్రి సోమవారం టెలికాన్ఫరెన్స ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఆస్తి,ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జనజీవనానికి ఆటంకం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నానన్నారు. ఉభయజిల్లాల్లో చెరువులు, జలాశయాల నీటిమట్టంపై మంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దని మంత్రి ఆదేశించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌, భద్రాచల సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశామని 08744-241950, 087 43- 232444 నెంబర్లకు ఫోనచేసి సహాయం పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-13T06:49:56+05:30 IST