గిరివికాసమేదీ?

ABN , First Publish Date - 2022-06-07T06:21:33+05:30 IST

గిరివికాసమేదీ?

గిరివికాసమేదీ?
కొణిజర్ల మండలం విక్రంనగర్‌లో గిరివికాస్‌ కింద మూడునెలల క్రితం వేసిన బోరు

శాఖల మధ్య సమన్వయలోపం.. పథకానికి శాపం

విద్యుతలైన్లకు అడ్డుపడుతున్న అటవీశాఖ

కరెంట్‌లైన్లు, మోటార్ల ఏర్పాటులో నిర్లక్ష్యంతో నిరుపయోగంగా బోర్లు

ఖమ్మం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిధులు ఉన్నా పనులకు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంలోపం పథకం లక్ష్యానికి శాపంగా మారింది. ఉమ్మడిజిల్లాలో భూమి కలిగి ఉన్న గిరిజన రైతులకు సాగునీరు కల్పించి, వారిని వ్యవసాయపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరివికాస్‌ పథకం అధికారుల సమన్వయలోపం కారణంగా లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్రభుత్వం సకాలంలో గిరిజన రైతులకు బోర్లు, మోటార్లు అందించి, రైతులకు సాగునీరు అందించి పంటలు పండించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనుల్లో జాప్యం జరుగుతోంది. రెవెన్యూ పట్టాలున్న సన్న, చిన్నకారు గిరిజన రైతులతో పాటు పోడు పట్టాలున్న రైతులకు కూడా ఈపథకం కింద లబ్ధి పొందే సౌలభ్యం ఉంది. కనీసం ఇద్దరు రైతులు సుమారు 8ఎకరాల నుంచి 9ఎకరాల భూమి వరకు సాగునీరు అందించేందుకు ఈ గిరివికాస్‌ పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిర జలప్రభ పేరుతో నడిచిన ఈ పథకాన్ని గిరిజన వికాసం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల వరకు గిరిజన రైతులకు సాగునీరు లేని పరిస్థితి ఉంది. దీంతో వర్షాధార పంటలు వేసి రైతులు పంటలు పండిస్తున్నారు. పత్తి, కంది, పెసర, జొన్న లాంటి పంటలు వేయడం, వర్షం అనంతరం బీడుభూములుగా ఉంచడం జరుగుతుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరివికాస్‌ పథకంతో జిల్లాలో అర్హత ఉన్న ప్రతీ గిరిజన రైతుకు బోరు, కరెంట్‌ మోటారు అమరిస్తే గిరిజన రైతులు వాణిజ్య, ఆహార పంటలతోపాటు కూరగాయలు, పండ్లతోటలకూడా సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడిఖమ్మంజిల్లాలో రూ.17కోట్ల వ్యయంతో సుమారు 838వరకు బోర్లు వేశారు. కానీ చాలావాటికి విద్యుత లైన్లు వేయలేదు. కరెంట్‌ మోటార్లు అమర్చలేదు. లెక్కల్లో ఘనంగా చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గిరిజన రైతులు ఇద్దరి కలిసి దరఖాస్తులు చేసుకున్నా క్షేత్రస్థాయిలో భూమలు పరిశీలన, భూగర్భజలాల పరిస్థితి అంచనా వేయడంలో జాప్యం చేస్తున్నారు. బోరు వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు పరిశీలించడం, దానికి లెక్కలు వేయడం కూడా జాప్యం జరుగుతుంది. దీంతో పాటు బోరుకు విద్యుతలైన్లకు ఎన్పీడీసీఎల్‌కు డబ్బులు చెల్లించినా ట్రాన్స్‌కో అధికారులు సత్వరం కరెంట్‌లైన్లు వేయడంలేదు. దీంతో మోటార్లు అమర్చడంలేదు. దీంతో అవి వృథాగా ఉంటున్నాయి. దీనికితోడుగిరిజన భూములన్నీ అటవీప్రాంతాల్లోనే అధికంగా ఉండడంతో కరెంట్‌లైన్లు వేయడానికి అటవీశాఖ అడ్డుచెబుతోంది. పోడుపట్టాలు కలిగిన భూముల్లో బోర్లు వేసిన చోట విద్యుతలైన్లు వేసేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడంలేదు. ఖమ్మంజిల్లాలో కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో అటవీశాఖ అభ్యంతరాల కారణంగా కరెంట్‌లైన్లు వేయకపోవడంతో గిరివికాస్‌ పథకం లక్ష్యానికి అవరోధం ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లా పరిధిలో 300వరకు గిరివికాస్‌ కింద బోర్లు మంజూరుకాగా 200వరకు బోర్లు వేయగా, అందులో 122కు మాత్రమే కరెంట్‌లైన్లు ఏర్పాటుచేశారు. 94చోట్ల మాత్రమే మోటార్లు అమర్చారు. భద్రాద్రి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ సుమారు 500వరకు బోర్లు వేయగా, ఇప్పటి వరకు సగం బోర్లకు మాత్రమే విద్యుత మోటార్లు అమర్చారు. భద్రాచలం ఐటీడీఏ నిధుల సహకారంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల పర్యవేక్షణలో గిరివికాస్‌ పథకం అమలవుతోంది. డీఆర్‌డీఏ, ఐటీడీఏ, ట్రాన్స్‌కో, అటవీశాఖ అధికారుల సమన్వయలోపంతో ఈపథకం కింద గిరిజన రైతులకు సాగునీరు సకాలంలో అందడంలేదు. బోర్లు వేసిన వెంటనే విద్యుతలైన్లు ఏర్పాటుచేసి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే పథకం ద్వారా రైతులకు త్వరితగతిన ప్రయోజనం లభిస్తుంది. వాస్తవానికి ఎక్కువమంది రైతులకు ఈ పథకం పట్ల అవగాహన లేదు. తక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా పనులు వేగవంతంగా చేపట్టడంలేదు. 


ఇరు జిల్లాల్లో పలుచోట్ల..

కొణిజర్ల మండలంలో విక్రంనగర్‌లో గిరివికాస్‌ కింద బోర్లువేసి, కరెంట్‌లైన్లు సగంలోనే ఆపేశారు. కల్లూరు మండలంలో ఈపథకం కింద ఏడు బోర్లు మంజూరవగా ఇప్పటికి ఒకటి వేసి కనెక్షన ఇచ్చారు. మిగిలివన్ని పెండింగ్‌లో ఉన్నాయి. పెనుబల్లి మండలంలో లింగగూడెం గ్రామంలో నలుగురికి గిరివికాస్‌ కింద బోర్లు, మోటర్లు మంజూరవగా ఒక్కచోట మాత్రమే బోరు వేసి మోటారు అమర్చారు. మిగిలినవి సర్వేచేయలేదు. సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు, చంద్రాయపాలెం, రేగలపాడు, యాతాలకుంట, చెరకుపల్లి గ్రామాల్లో 20బోర్లు మంజూరవగా చంద్రాయపాలెంలో మాత్రమే రెండుబోర్లు వేశారు. ఇంకా 18 బోర్లువేయాల్సి ఉంది. విద్యుతలైన్ల పనులు కూడా చేపట్టలేదు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చర్లలో 22మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, మండలంలో ఇప్పటి వరకు ఎవరికి గిరివికా్‌సకింద మోటర్ల అందజేయలేదు. సుజాతనగర్‌ మండలంలో ఈపథకానికి 250మందిరైతులు దరఖాస్తుచేయగా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయలేదు. జూలూరుపాడు మండలంలో అటవీశాఖ అధికారులు అభ్యంతరం కారణంగా కొందరు రైతులకు విద్యుతలైన్లు వేయకపోవడంతో పనులు చేపట్టలేదు. ఆళ్లపల్లి మండలంలో మొదటివిడతలో ఐదు బోర్లు వేశారు. స్తంభాలు వేసి వైర్లువేయకుండా వదిలారు. కేవలం ఒక్కబోరుకు విద్యుతలైన వేశారు. మిగతవాన్ని  నిరుపయోగంగా ఉన్నాయి. ఇదే తీరున జిల్లాలో అన్ని మండలాల్లోను గిరివికాస్‌ పథకానికి బోర్లువేసిన చోట్ల కరెంట్‌లేదు. కరెంట్‌ ఉన్నచోట్ల మోటర్లు ఇవ్వలేదు. బోర్లు వేసి, కరెంట్‌లైన్లువేసి మోటార్లు పెట్టినచోట రైతులు పంటపొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. 


బోరు వేశారు.. విద్యుత లైన ఇవ్వలేదు

గుగులోత సరోజ, విక్రంనగర్‌, కొణిజర్ల మండలం

గిరివికాస్‌ పథకం కింద మూడు నెలల క్రితం బోరు వేశారు. విద్యుతలైన లాగుతుంటే అటవీశాఖ అధికారులు అడ్డుచెప్పడంతో స్తంభాలు వేసి వదిలేశారు. పంటలు పండాలంటే కరెంట్‌ ఇచ్చి మోటర్‌ పెడితే పంటలు పండుతాయి. ఇంతకాలం నీరులేదని, బాధపడ్డాం.. గిరివికాస్‌ కింద బోరు వేస్తే సంతోషించాం. కానీ బోరు చూసుకోవడం తప్ప నీరు పారని పరిస్థితి. 
Read more