ఫ్లూ పంజా

ABN , First Publish Date - 2022-09-14T05:02:03+05:30 IST

కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఫ్లూ పంజా విసురుతోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతోపాటు కడుపునొప్పి, అతిసారం, న్యూమోనియా లాంటి లక్షణాలతో

ఫ్లూ పంజా

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బాధితులు

చిన్నారులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

ఖమ్మంలో ఒకరికి స్వైనఫ్లూ నిర్ధారణ..!

ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి 

స్థానికంగా లేని పరీక్షలు.. అయోమయంలో వైద్యులు

ఖమ్మం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఫ్లూ పంజా విసురుతోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతోపాటు కడుపునొప్పి, అతిసారం, న్యూమోనియా లాంటి లక్షణాలతో వస్తున్న రోగులతో ఆసుపత్రుల కిటకిటలాడిపోతున్నాయి. ఐదేళ్ల లోపు పిల్లలు మొదలు వృద్ధుల వరకు జ్వరంతో వస్తున్న వారి సంఖ్య పదిహేనురోజులుగా పెరుగూతూ ఉంది. ఇక ఈ బాధితుల్లో అత్యధికంగా చిన్నారులు ఉండటం గమనార్హం. గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చిన్నారులపై ఫ్లూ పంజా విసురుతుండటంతో జ్వరలక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న పిల్లల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో ఫ్లూ వైరస్‌ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫ్లూ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో అత్యధికశాతంమంది ఫ్లూ భారిన పడుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే సాధారణంగా ఉండే ఫ్లూ కంటే ప్రస్తుతం వస్తున్న కేసుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఫ్లూతో ఆసుపత్రులకు వస్తున్న చిన్న పిల్లలు కనీసం పదిరోజుల వరకు వేదన పడుతున్నారని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు తీవ్రంగా ఉండటంతో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టమవుతోంది. 

స్థానికంగా లేని నిర్ధారణ పరీక్షలు..

రెండుమూడేళ్ల తర్వాత విజృంభిస్తున్న స్వైన ఫ్లూ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో స్వైనఫ్లూ కేసులు నమోదవుతుండగా జిల్లాలోనూ ఓ స్వైనఫ్లూ కేసు నిర్ధారణైననట్టు సమాచారం. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులోని థియేటర్‌కు సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో చేరిన ఒకరికి పరీక్షలు నిమిత్తం పంపగా స్వైనఫ్లూగా నిర్ధారణైననట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇది జరిగి రోజులు గడుస్తున్నా విషయాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. రెండేళ్లుగా కొవిడ్‌ బారిన పడకుండా తీసుకున్న జాగ్రత్తలతో ఆ సయయంలో ఇతర ఫ్లూల బారిన పడలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే స్వైనఫ్లూలో జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర ఫ్లూ వైరస్‌లలో, కరోనాలోనూ కనిపిస్తుండటంతో అటు వైద్యులు, ఇటు రోగులు వారి కుటుంబీకుల్లో అయోమయం కనిపిస్తోంది. ప్రస్తుతం పలు రకాల లక్షణాలతో వచ్చే వారిలో ఫ్లూ వైరస్‌లకు సంబంధించిన లక్షణాలు ఉంటున్నా వారికి పరీక్షలు నిర్వహించకపోవడంతో వచ్చిన వారిలో ఏ రకమైన వైరస్‌ ఉందన్న నిర్ధారణకు రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దాంతో చాలామంది వైద్యులు సాధారణ చికిత్స చేసి పంపుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో హెచ1ఎన1 పరీక్షలు నిర్వహిస్తుండగా పదుల సంఖ్యలో స్వైనఫ్లూ కేసులు బయటపడుతుండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరీక్షలు లేకపోవడంతో కేసులు వెలుగులోకి రావడం లేదని తెలుస్తోంది.  

బాధితుల్లో పిల్లలే అధికం 

ప్రస్తుతం పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న చిన్నపిల్లల్లో ఫ్లూ వైరస్‌తో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా చల్లని వాతావరణం, వర్షాల ప్రభావంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న పిల్లలను ఇంటివద్దనే ఉంచి చికిత్స అందించడం ద్వారా కొంతమేర వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అయితే ఖమ్మంలో వెలుగులోకి వచ్చిందని తెలసిన స్వైన ఫ్లూ కేసుకు సంబంధించి, జిల్లాలో ఫ్లూ పరీక్షల గురించి వివరాలు అడిగేందుకు జిల్లా వైద్యశాఖాధికారిని ఫోన ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు.

Read more