‘పాలేరు’లో ఫ్లెక్సీ రగడ

ABN , First Publish Date - 2022-09-19T06:45:19+05:30 IST

‘పాలేరు’లో ఫ్లెక్సీ రగడ

‘పాలేరు’లో ఫ్లెక్సీ రగడ
చేపపిల్లలను పోస్తున్న ఎమ్మెల్యే కందాళ

ప్రొటోకాల్‌ వివాదం రేపిన చేపపిల్లలు వదిలే కార్యక్రమం

బ్యానర్‌లో ఫొటోలు లేకపోవడంపై ఎమ్మెల్సీ తాతా మధు అసంతృప్తి

ఊడిగం కాదు ఉద్యోగం చేయాలంటూ మత్స్యశాఖ అధికారిపై ఆగ్రహం

కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుదిరిగిన ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు

అరగంట తర్వాత జలాశయంలో పిల్లలు వదిలిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి, సెప్టెంబరు 18 : చేపపిల్లలు వదిలే కార్యక్రమ నేపథ్యంలో ఫ్లెక్సీ రగడ జరిగింది. ఫ్లెక్సీలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఫొటోలను మాత్రమే ముద్రించడంపై జిల్లా మత్స్యశాఖ అధికారిపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కూసుమంచి మండలం పాలేరు జలాశయం వద్ద ఆదివారం జరిగింది. పాలేరు జలాశయంలో ఆదివారం ఉదయం చేపపిల్లలు విడుదల చేసేందుకు నిర్ణయించిన మత్స్యశాఖ అధికారుల ఆహ్వనం మేరకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ ఉదయం 10గంటలకు పాలేరు జలాశయం వద్దకు వచ్చారు. కానీ ఆసమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేవలం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ గౌతమ్‌ ఫొటోలు మాత్రమే ముద్రించడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ జిల్లా మత్సశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికారులు అధికారుల లెక్క ఉండండి.. రాజకీయాలు చేయొద్దు. ఉద్యోగం చేయండి. ఎవరికీ ఊడిగం చేయొద్దు. మంత్రికి, ఎమ్మెల్యేకేనా ఫ్లెక్సీ.. మిగిలిన వారికి పెట్టరా..? అలా చేయమని ప్రభుత్వం ఏమైనా చెప్పిందా.. మీ కమిషనర్‌తో మాట్లాడమంటావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయానికి అక్కడికి మంత్రి, ఎమ్మెల్యే రాకపోవడంతో కార్యక్రమం జరిగే వరకు ఉండకుండానే ఎంపీలు నామ, వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచి, ఎంపీటీసీలకు కూడా సమాచారం లేదని కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయిన అరగంట తర్వాత ఎమ్మెల్యే కందాళ ఉపేంర్‌రెడ్డి అక్కడకు చేరుకుని చేపపిల్లలను వదిలారు.  


మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కందాళ

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పాలేరు జలాశయంలో రూ.15లక్షల విలువైన 13.10లక్షల చేపపిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అర్థికాభివృద్ధి కోసం ప్రతీఏడాది పెద్దమొత్తంలో చేపపిల్లలను వదులుతున్నారని, పాలేరు నియోజకవర్గంలో మొత్తం 238 మధ్యతరహా చెరువుల్లో, కుంటల్లో రూ.55. 83లక్షల విలువైన 69.99 లక్షల చేపపిల్లలును వదిలేకార్యక్రమం చేపట్టామన్నారు. ఈసందర్భంగా పలువురు మత్స్యకారులు ప్రభుత్వం నుంచి పాలేరు జలాశయంలో రొయ్యపిల్లలు పోయించాలని, వలలు తెప్పలు ఇప్పించాలని విజ్ఞప్తి చేయగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఏడీ ఆంజనేయస్వామిని ఆదేశించారు. ఇక ఫ్లెక్సీల రగడ విషమమై ఎఫ్‌డీవోను మందలించిన ఎమ్మెల్యే ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రొటోకాల్‌ పాటింపు, సమాచారం అందజేతలతో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, కూసుమంచి, నేలకొండపల్లి ఎంపీపీలు బాణోతు శ్రీనివాస్‌, వజ్జా రమ్య, సీడీసీ చైర్మన్‌ నెల్లూరి లీలా ప్రసాద్‌, ఆత్మచైర్మన్‌ రామసహాయం బాలకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసీ్‌ఫపాషా, తదితరులు పాల్గొన్నారు.


కిందపడబోయిన కందాళ

పాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదలచేసి తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మెట్లపై కాలుజారి కిందపడబోగా.. ఆయన్ను పక్కనున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 



Updated Date - 2022-09-19T06:45:19+05:30 IST