సీజనకు ముందే నకిలీ.. మకిలీ

ABN , First Publish Date - 2022-04-24T06:51:05+05:30 IST

సీజనకు ముందే నకిలీ.. మకిలీ

సీజనకు ముందే నకిలీ.. మకిలీ
ఇటీవల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టుబడిన నకిలీ పొటాష్‌ బస్తాలు, పరిశీలిస్తున్న అధికారులు

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న ఎరువులు, విత్తనాలు

అప్రమత్తంగా లేకపోతే మళ్లీ గతేడాది పరిస్థితే

ఖమ్మం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతిప్రతినిధి): వానాకాలం వ్యయవసాయ సీజన ప్రారంభానికి ముందే నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అసలు సీడ్‌ కంపెనీలు, ఎరువులు ఇంకా మార్కెట్‌లోకి రాకముందే నకిలీ వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. పొరుగురాష్ట్రాలనుంచి తెలంగాణకు సరఫరా చేసి గుట్టుచప్పుడుగా వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా లేకపోతే మళ్లీ గతేడాది నకిలీ విత్తనాలు, ఎరువులు, వ్యాపారం జోరుగా సాగినట్టే ఈఏడాది కూడా దొంగదారిలో జరిగే పరిస్థితి నెలకొంది. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో వారం క్రితం సరిహద్దు ఏపీ నుంచి 200బస్తాల నకిలీ పొటాష్‌ ఎరువులు తెచ్చి అమ్ముతుండగా అనుమానమొచ్చిన రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదుచేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

ఇసుక కలిపి మాయ..

పొటా్‌షలో ఇసుకను కలిపి.. గుర్తింపుపొందిన ఐపీఎల్‌ కంపెనీ బస్తాల్లో నింపి తెచ్చి అమ్ముతున్నారు. రైతులు పామమాయిల్‌తోటల్లో పొటాష్‌ ఎరువును డ్రిప్‌ పద్ధతిలో ఎరువును అందించేందుకు ఆ పొటా్‌షను నీటిలోపోయగా అడుగున అంతా ఇసుక కనిపించింది. ఇసుక ఉండడంతో అనుమానం వచ్చి వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయగా అది నకిలీ ఎరువు అని తేలింది. ఐపీఎల్‌ కంపెనీకి సంబంధించిన పాత బస్తాలు ఎంఆర్‌పీ ధర తక్కువ ఉన్నా అడ్డదారిలో కొనుగోలు చేసి ప్రస్తుతం రేట్లు పెరిగిన తర్వాత అదే బస్తాల్లో నకిలీ పొటాష్‌ ఎరువును నింపి సత్తుపల్లికి ఏపీలోని గుంటూరు నుంచి రవాణా చేసినట్టు తెలిసింది. అయితే ఎంఆర్‌పీ ధర వద్ద కొట్టేసి ఉండడం, బిల్లులేకుండా విక్రయాలు చేస్తుండడంతో ఈవ్యవహారం బయటకు వచ్చింది. గతంలో 50కిలోల బస్తా ఎంఆర్‌పీ రూ.1050 ఉండగా ప్రస్తుతం ఈ కంపెనీ పొటాష్‌ ధర రూ.1700వరకు ఉంది. ధర మారినప్పుడల్లా ఎరువుల కంపెనీలు బస్తాలపై ధరలు మార్చి ఎరువులు నింపి మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. పాత ఎంఆర్‌పీ ముద్రించిన బస్తాలను ఇతర అవసరం ఉన్నవారు కొనుగోలు చేసుకుంటారు. ఈ పద్ధతిలో పాతబస్తాలను కొనుగోలు చేసి ఆ కంపెనీ బ్రాండ్‌ పేరుమీద నకిలీ పొటాష్‌ ఎరువును సృష్టించి మార్కెట్‌లోకి దొంగచాటుగా పంపారు. గుంటూరు కేంద్రంగా ఈనకిలీ పొటాష్‌ తయారుచేసి విక్రయాలు చేస్తున్నట్టు తెలిసింది. 

పలుమార్లు పట్టుబడిన నకిలీ సరుకు

గతేడాది ఖమ్మం జిల్లాలో సేంద్రియ ఎరువుల పేరుతో మట్టి ఎరువులు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి హైబ్రిడ్‌ రకం మిర్చి, పత్తి విత్తనాలు కూడా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పెద్దఎత్తున పట్టుబడ్డాయి. సుమారు రూ.3కోట్లుకు పైగా అనుమతిలేని విత్తనాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టుకున్నారు. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23చోట్ల సుమారు రూ.50లక్షల విలువైన విత్తనాలు పట్టుబడగా ఖమ్మంజిల్లాలో రూ.2.50కోట్ల విలువైన విత్తనాలు పట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా హైబ్రిడ్‌ రకం మిర్చి విత్తనాలే అధికంగా ఉన్నాయి. గతేడాది మిర్చి విత్తనాల సీజనలో ఖమ్మం అర్బన మండలంలో లైసెన్సులు లేకుండా రూ.26.37లక్షల విలువైన 4,875 ప్యాకెట్ల అనుమతిలేని మిర్చి విత్తనాలను పట్టుకున్నారు. అలాగే రఘునాథపాలెం పోలీసుస్టేషన పరిధిలో పంగిడి గ్రామంలో రూ.8లక్షల విలువైన 1920 మిర్చి విత్తనాల ప్యాకెట్లు, 64పత్తి విత్తనాల ప్యాకెట్లు గతేడాది జూనలో స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి మామిడితోట శివారులో ఎలాంటి అనుమతిలేకుండా మిర్చి విత్తనాలు తయారుచేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్సు పోలీసులు గతేడాదిజూనలో దాడిచేసి 240కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. అలాగే బోనకల్‌ పోలీసుస్టేషన పరిధిలో కూడా బోనకల్‌ గ్రామంలో ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించి అనుమతిలేని విత్తనాలు రూ.3లక్షల విలువైన వాటిని పట్టుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఏన్కూరు పోలీసుస్టేషన పరిధిలోని ఏన్కూరు గ్రామానికి చెందిన కొందరు యువకులతోపాటు కర్ణాటకకు చెందిన మిర్చి విత్తనాల కంపెనీనుంచి కోటి43లక్షల విలువైన విత్తనాలు సీజ్‌చేశారు. ఇందులో పలురకాల ప్రైవేటు కంపెనీల విత్తనాలున్నాయి. కర్ణాటక, హైదరాబాద్‌తోపాటు పలు రాష్ట్రాల్లో తయారుచేసిన హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలపేరుతో అమ్మకాలు జరిపారు. ఇలా ఉమ్మడి జిల్లాలో జూలూరుపాడు, సుజాతనగర్‌ తదితర మండలాల్లోకూడా అనుమతిలేని మిర్చి, పత్తి విత్తనాలను పోలీసులు పటుకున్నారు. రాష్ట్రంలో మిర్చి, పత్తిసాగులో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎక్కువమంది రైతులు ఆసక్తి చూపుతారు. ప్రతిఏటా ఉమ్మడిజిల్లాలో లక్షన్నర ఎకరాలపైగా మిర్చి, రూ.3.50లక్షలకు పైగా పత్తి సాగవుతుంది. దీనికితోడు ఇటు ఏపీకి సరిహద్దున ఉండడంతో గుంటూరుతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాలు, కర్ణాటక, నుంచి తయారయ్యే అనుమతిలేని కంపెనీ విత్తనాలు పొరుగురాష్ట్రాలనుంచి ఖమ్మంజిల్లా మీదుగా తెలంగాణలోని పలు జిల్లాలకు రవాణా చేస్తున్నారు. 

సీజనకు ముందే..

ఈ ఏడాది వానాకాలం సీజన మొదలు కాబోతున్నందున నకిలీ ఎరువులు, విత్తనాలు, అనుమతిలేని కంపెనీలు మార్కెట్‌లోకి ఉత్పత్తులు పంపేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. రైతులు పొలాల కౌలు మాట్లాడుకుని వేసవి దుక్కులు సాగిస్తున్నారు. ఈసారి పత్తిసాగుకూడా గణనీయంగా పెరగబోతోంది. ఈక్రమంలో గతేడాది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నకిలీ విత్తన వ్యాపారులు, అనుమతిలేని కంపెనీలు రైతులకు విత్తనాలు, ఎరువులు అమ్మేందుకకు దొడ్డిదారిన పలు పద్ధతుల్లో జిల్లాలకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు ట్రాన్సపోర్టు కంపెనీలు, రైళ్లు, బస్సులు, ఇతర రవాణాసేవల ద్వారా జిల్లాలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి పరిస్థితిని బట్టి ఆయా గ్రామాల డీల ర్లు వాటిని తీసుకుని విక్రయించేందుకు రంగంసిద్ధం చేస్తున్నారు. పేరొందిన కంపెనీ విత్తనాలు, ఎరువులు ధరలకంటే ఇవి తక్కువగా ఉండడం, బ్రాండెడ్‌ కంపెనీల మాదిరిగా కవర్లు ముద్రించడం, రైతులకు అప్పుగా తక్కువరేటుకు అంటగట్టడం జరుగుతుంది. గతేడాది పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఈఏడాదైనా వ్యవసాయశాఖనకిలీ విత్తనాలు, ఎరువులపై ముందుగానే దృష్టిపెట్టి తనిఖీలు విస్తతం చేస్తే కొంతవరకైనా నకిలీ విత్తనాలు, ఎరువులు వ్యాపారం నివారించి రైతులకు నష్టం లేకుండా చూసే అవకాశం ఉంటుంది.

Updated Date - 2022-04-24T06:51:05+05:30 IST