బీజేపీ పాలనలో అంతా ధనస్వామ్యమే

ABN , First Publish Date - 2022-12-09T00:53:00+05:30 IST

బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పోయి అంతా ‘ధన’స్వామ్యమే వచ్చిందని, ఎన్నికల్లో ఆ పార్టీ డబ్బు పంపిణీతోనే గెలుపొందుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన ఆరోపించారు.

బీజేపీ పాలనలో అంతా ధనస్వామ్యమే
విలేకరులతో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు విజయరాఘవన్‌, పక్కన తమ్మినేని వీరభద్రం

డబ్బుతోనే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోంది

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన

మునుగోడులో పొత్తు తర్వాతే పోడు సమస్యపై కదలిక

రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మంలో విలేకరుల సమావేశం

ఖమ్మం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పోయి అంతా ‘ధన’స్వామ్యమే వచ్చిందని, ఎన్నికల్లో ఆ పార్టీ డబ్బు పంపిణీతోనే గెలుపొందుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన ఆరోపించారు. ఏపీలోని జంగారెడిగూడెంలో జరుగుతున్న వ్య.కా.సం. రాష్ట్ర మహాసభలకు వెళుతూ ఖమ్మంలో ఆగిన ఆయన గురువారం నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోలుతో తమ విపక్షాలపాలనలో ఉన్న ప్రభుత్వాలను కూలదోస్తున్నారని విమర్శించారు. దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, కొవిడ్‌ పరిస్థితుల కారణంగా నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువైందని, పెట్టుబడిదారు లు పైపైకి పోతుంటే పేదల జీవితాలు మాత్రం మరింత దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనివీరభద్రం మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో తాము టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్‌ పోడుభూముల సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేశారన్నారు. పోడుభూముల సమస్యలు, ధరణితో ఇబ్బందులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం లాంటి పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అయితే ఇవి పూర్తిస్థాయిలో పరిష్కారం కావాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలతో ప్రజాసమస్యలు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకటి రెండు ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ అడ్డదారుల్లో నడుస్తోందని ఆరోపించారు. జర్నలిస్టులతోపాటు పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని తమ్మినేని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ప్రజాసమస్యలపై త్వరలోనే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దీనికి ప్రజామద్దతు కావాలని కోరారు. గొత్తికోయలకు కూడా అటవీభూముల పట్టాలు ఇవ్వాలని, వారిని వెళ్లగొట్టాలనుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం జాతీయ నాయకుడు ఎన.చంద్రన, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బి.వెంకట్‌, సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతినేని సుదర్శన, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరారవు, జిల్లానాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T00:53:11+05:30 IST