తీరంలో తెగింపు

ABN , First Publish Date - 2022-11-27T22:02:37+05:30 IST

అక్కడ ఎలాంటి భూములున్నా వాటికి సంబంధించి క్రయ విక్రయాలు సాగకూడదు. వెంచర్లకు సంబంధించి అనుమతులు ఇవ్వకూడదు. ప్లాట్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు నిషేధం. కానీ అక్కడవ్వన్నీ ఒట్టి మాటలే.. ఆ నదీ తీరంలో సాధారణభూములకు మాదిరే అన్ని రకాల పనులూ సాగుతుంటాయి.

తీరంలో తెగింపు
మున్నేరు నది తీరం

మున్నేరు బఫర్‌ జోనలో భవంతులు

అడ్డగోలుగా రిజిస్ర్టేషన్లు..

ఇంటి నెంబర్లు సైతం కేటాయిస్తున్న వైనం

అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని అధికారులు

దందాలో ఓ వ్యాపారవేత్త కుమారుడి హస్తం ?

ఖమ్మం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అక్కడ ఎలాంటి భూములున్నా వాటికి సంబంధించి క్రయ విక్రయాలు సాగకూడదు. వెంచర్లకు సంబంధించి అనుమతులు ఇవ్వకూడదు. ప్లాట్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు నిషేధం. కానీ అక్కడవ్వన్నీ ఒట్టి మాటలే.. ఆ నదీ తీరంలో సాధారణభూములకు మాదిరే అన్ని రకాల పనులూ సాగుతుంటాయి. భూముల రిజిస్ట్రేషన్ల నుంచి మొదలుకుని ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చేయకూడని అక్రమాలన్నీ చేస్తూ ‘తీరంలో తెగింపు’ చర్యలకు పాల్పడుతున్నారు కొందరు. ఖమ్మం నగర పరిఽధిలో మున్నేరు తీరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా యి. అయితే ఆయా నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే వాటికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది వచ్చినట్లు మున్నేరుకు భారీ వరద వస్తే ఆయా నిర్మాణాలవల్ల అక్కడ నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బఫర్‌లో జోరుగా రిజిసే్ట్రషన్లు

నది, చెరువు, కుంట, కాల్వ నీటి వనరున్న ప్రాంతమేదైనా సరే.. నీటి వనరు అంశాన్ని బట్టి దాని బఫర్‌ జోనలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినా వాటిని కూల్చివేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కాగా ఖమ్మం నగరానికి ఆనుకొని ప్రవహిస్తున్న మున్నేరు నది బఫర్‌ జోనలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగర పరిధిలో భూముల ధరలు ఆకాశానికి అంటడంతో పాటు మున్నేరు నది ఖమ్మం నగరాన్ని చుట్టేసినట్లు ఉండడంతో దాని పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు భూమి దొరుకుతుందని కొందరు రియల్టర్లు బఫర్‌జోనలో ఉన్న భూమిని సామాన్య, మధ్యతరగతి పేదలకు అంటగడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న ప్రైవేటు భూముల సర్వే నెంబర్లతో బఫర్‌ జోనలోని 123సర్వే నెంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని సైతం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక బఫర్‌జోనకు సంబంధించి ప్రభుత్వ భూమైనా, ప్రైవేటు భూమైనా అక్కడ రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిషేధం. అయినా నిబంధనలకు విరుద్ధంగా అక్కడి భూములకు భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో కొనుగోలుదారులు సైతం హద్దులు దాటి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఆయా స్థలాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతోపాటు ఎప్పుడైనా భారీ వరదలు వస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. అయితే మున్నేరు బఫర్‌జోనలో చేపడుతున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ కట్టడాలపై ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్టర్‌ అయిన సదరు వ్యక్తి బఫర్‌జోనలో నిషేధం ఉన్నా తన భూమి చూపి క్రయవిక్రయాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అతడికి పలుకుబడి ఉండటంతో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదే అదునుగా సదరు వ్యక్తి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కొంతమేరకు విక్రయించారన్న చర్చ జరుగుతోంది.

అడ్డగోలుగా అనుమతులిస్తున్న అధికారులు

బఫర్‌ జోనలో భవనాల నిర్మాణం చేయడమే పెద్ద తప్పు కాగా.. ఆయా భవనాలను గుర్తించి కూల్చివేయాల్సిన అధికారులే వారికి గ్రీనసిగ్నల్‌ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ, మున్సిపల్‌ యాక్ట్‌ ప్రకారం వాగు, కాలువ వంటివి పది మీటర్ల వెడల్పుతో ఉంటే వాటికి 9 మీటర్ల తర్వాత మాత్రమే అనుమతివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉంటే హద్దు దాటిన తర్వాత 30మీటర్ల దూరం ఉంటే మాత్రమే అనుమతివ్వాలి. చెరువులు, కుంటలకు 10హెక్టార్ల లోపు ఉంటే 9మీటర్ల వరకు బఫర్‌ జోనగా నిర్ణయిస్తారు. 10హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే 30మీటర్ల తర్వాత మాత్రమే కట్టడాలకు అనుమతిస్తారు. చిన్న కాల్వలకు మూడు మీటర్ల వరకు అనుమతివ్వకూడదు. పెద్దస్థాయి నది పరివాహక ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్‌ నుంచి 50నుంచి 100మీటర్ల దూరం వరకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఖమ్మం కార్పొరేషనలో ఉన్న మున్నేరు తీరంలో మాత్రం అధికారులు అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా భవనాల నిర్మాణాలకు యథేచ్చగా అనుమతులు మం జూరు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయా అనుమతులతో సంబంధిత వ్యక్తులు నిర్మాణాలు చేపట్టి విక్రయించడం, లేదా ఎవరికైనా అద్దెలకు ఇచ్చుకుని అక్రమార్జన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా ఒకరిని చూసి మరొకరు తమ పాత నిర్మాణాలకు భారీ భవంతులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శ లు వినిపిస్తోంది. ఇలాంటి నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆనలైనలోనే తాత్కాలిక ఇంటి నెంబర్ల కేటాయింపు జరుగుతున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే కొందరు రియల్టర్ల మోసాల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో ఆయా భూములను కొనుగోలు చేసి మోసపోతున్నారు. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-11-27T22:02:38+05:30 IST