గాంధీ సిద్ధాంతాన్ని అవమానిస్తున్న గాడ్సే వారసులు

ABN , First Publish Date - 2022-08-10T05:39:47+05:30 IST

జాతిపిత మమహాత్మాగాంధీ సిద్ధాంతాలను నేడు దేశాన్ని పాలిస్తున్న గాడ్సే వారసులు అవమానిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆలిండి

గాంధీ సిద్ధాంతాన్ని అవమానిస్తున్న గాడ్సే వారసులు

  స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో బీజేపీ ఆర్భాటం విడ్డూరంగా ఉంది 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పాలేరు శివాలయంలో ఆజాదీకా గౌరవ్‌యాత్ర ప్రారంభం

ఇల్లెందులో పొదెం వీరయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర 

ఖమ్మం(ఆంధ్రజ్యోతిప్రతినిధి)కూసుమంచి/ఇల్లెందు టౌన, ఆగస్టు 9: జాతిపిత మమహాత్మాగాంధీ సిద్ధాంతాలను నేడు దేశాన్ని పాలిస్తున్న గాడ్సే వారసులు అవమానిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు ఖమ్మంజిల్లా పాలేరులోని కూసుమంచి శివాలయం నుంచి ఆజాదీకా గౌరవ్‌ యాత్రను భట్టి విక్రమార్క ప్రారంభించారు. అంతకుముందు శివాలయంలో భట్టి తన సతీమణి మల్లు నందినితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి భట్టి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ ఆలోచనలను ప్రజలకు తెలిపేందుకు  నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యాలయానికి బీజేపీ ప్రభుత్వం తాళాలు వేయించడం స్వాతంత్ర ఉద్యమస్పూర్తిని అవమానించడమేనన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ నేడు స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత బాగుండాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. గాంధీజీ నాయకత్వంలో సాగిన స్వాంతంత్ర సంగ్రామ చరిత్ర మరువలేనిదన్నారు. ఈ ఉద్యమంలో పింగళి వెంకయ్య, బోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి తెలుగువారు కీలకపాత్ర పోషించారన్నారు. జాతీయజెండాను తయారుచేసిన పింగళి వెంకయ్యను గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. స్వాతంత్య్ర పోరాటం నేటి తరానికి తెలియచేయడానికే ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రను కాంగ్రెస్‌ నిర్వహిస్తోందన్నారు. మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ భారతదేశం అంటేనే కాంగ్రెస్‌ పార్టీ అని, కాంగ్రెస్‌ పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. నాయకులు పార్టీని వీడినంతమాత్రాన కాంగ్రెస్‌కు నష్టంలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. తొలిరోజు యాత్ర కూసుమంచి శివాలయంనుంచి కేశవపురం, జీళ్లచెరువు, గోపాలరావుపేట, తల్లంపాడు, పొన్నెకల్‌, మద్దులపల్లి వరకు 15కి.మీ సాగింది. బుధవారం ఉదయం మద్దులపల్లి గ్రామం నుంచి ప్రారంభమై కోదాడ క్రాస్‌రోడ్డు, వరంగల్‌ క్రాస్‌రోడ్డు, పెద్దతండ, నాయుడుపేట, కాల్వొడ్డు ఖమ్మం, మయూరీసెంటర్‌, ఇల్లందు క్రాస్‌రోడ్డు, వైరారోడ్డు, ఇందిరానగర్‌ కాలనీలో కొనసాగుతంది. రాత్రికి సిటీ ఫంక్షన్‌హాల్‌లో బసచేస్తారు. ఆగస్టు 15వరకు ఖమ్మంజిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 75కి.మీల మేర పాదయాత్ర జరగనుంది. తొలిరోజు పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాధవీరెడ్డి, శేఖర్‌గౌడ్‌, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో భట్టి విక్రమార్కను వీఆర్యేలు కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతిపత్రం అందించారు. అలాగే ఆజాదీగౌరవ్‌యాత్రలో భాగంగా స్వాతంత్ర సమరయోధులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మానించారు.  

ఇల్లెందులో పొదెం వీరయ్య ఆధ్వర్యంలో..  

భద్రాద్రి జిల్లా ఇల్లెందులో కాంగ్రెస్‌ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో జాతీయజెండాలతో ఆజాదీకా గౌరవ్‌యాత్ర చేపట్టారు. స్థానిక మహబూబాబాద్‌ క్రాస్‌రోడ్డులోని ఆలయం నుంచి బొజ్జాయిగూడెం వరకు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో కాంగ్రెస్‌ సారధ్యంలోనే ప్రజలకు మౌళిక వసతుల కల్పన జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు లక్కినేని సురేందర్‌రావు, చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రాంచందర్‌నాయక్‌, ఏలూరి కోటేశ్వరరావు, డాక్టర్‌ జి.రవి, దొడ్డా డానియల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more