నకిలీ పామాయిల్‌ మొక్కల దందాను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-09-10T07:00:05+05:30 IST

నకిలీ పామాయిల్‌ మొక్కల దందాను అరికట్టాలి

నకిలీ పామాయిల్‌ మొక్కల దందాను అరికట్టాలి
ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేంద్రలను సన్మానిస్తున్న మాజీమంత్రి తుమ్మల

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి

ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌, ఎండీకి మాజీ మంత్రి తుమ్మల సూచన

బుగ్గపాడులో పామాయిల్‌ రిఫైనరీ నిర్మాణంపై ఆరా

దమ్మపేట, సెప్టెంబరు 9: నకిలీ పామాయిల్‌ మెక్కల దందాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయిల్‌ఫెడ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పిచేలా కృషి చేయాలని ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేంద్రకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మూడోసారి ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌గా నియమితులైన రామకృష్ణారెడ్డి ఎండీ సురేంద్రతో కలిసి తుమ్మలను గండుగులపల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానించిన తుమ్మల మాట్లాడుతూ రెండు నెలలుగా పామాయిల్‌ గెలల ధరలు పడిపోతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్‌ ధరల హెచ్చు తగ్గుల మేరకు రైతులకు గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌ రికవరీ రేటు పడిపోకుండా ఆయిల్‌ఫెడ్‌ అధికారులు రైతులతో సమన్వయం చేసుకోవలన్నారు. ధరణిలో చిన్న సన్నకారు రైతుల భూములు కొన్ని  నమోదు కాలేదని అలాంటి రైతులకు పూర్తి ధరపై పామాయిల్‌ మొక్కలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కులో పామాయిల్‌ రిఫైనరీకి మూడు సంవత్సరాల క్రితమే అనుమతులివ్వడం జరిగిందని ఫ్యాక్టరీనిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ తీసుకొనే నిర్ణయాలు రైతులకు లాభం చేకూర్చేలా ఉండాలన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకే పరిమితమైన పామాయిల్‌ సాగును రైతులకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఈసందర్భంగా ఆయిల్‌ఫెడ్‌ సిబ్బందిని తుమ్మల అభినందించారు. తుమ్మలను కలిసిన వారిలో ఆయిల్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌పాం ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్‌రెడ్డి, డివిజనల్‌ మేనేజర్‌  ఉదయ్‌కుమార్‌, అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్‌ ప్యాక్టరీల మేనేజర్లు కళ్యాణ్‌, బాలకృష్ణ, పామాయిల్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రాంచంద్రప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, దొడ్డా ప్రసాద్‌, కాసాని నాగప్రసాద్‌, చీమకుర్తి వెంకటేశ్వరరావు, తదితరులున్నారు

Read more