పత్తి.. కొత్త ఒరవడి!

ABN , First Publish Date - 2022-06-07T06:28:32+05:30 IST

పత్తి.. కొత్త ఒరవడి!

పత్తి.. కొత్త ఒరవడి!

ఒకే కోత పంట సాగుకు కసరత్తు

ఎకరానికి 16,500మొక్కలు.. 13క్వింటాళ్ల నుంచి 15క్వింటాళ్ల దిగుబడి

ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మక  సాగుకు ప్రయత్నాలు

ఖమ్మం వ్యవసాయం, జూన 6: సహజంగా పత్తిలో మూడు, నాలుగుసార్లు దూదిపంటను తీయాల్సి ఉంటుంది. కానీ కూలీల కొరతతో రైతులు తగిన రీతిలో పత్తిని సేకరించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో చివరిదశ పత్తిని తీసేందుకు కూలీలు దొరక్క పంటను వదిలేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో దిగుబడిని అందుకోలేకపోతున్నారు. దీన్ని గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులు ఒకే కోతతో పత్తి పంట పొందేలా కొత్త వంగడాలు అందుబాటులోకి తేవాలని జయశంకర్‌ విశ్వవిద్యాలయానికి గతంలో సూచించారు. ఈమేరకు నాగపూర్‌లోని జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఇచ్చిన నాలుగు వంగడాలు,  నూజివీడు విత్తన సంస్థ తయారుచేసిన మరో మూడు వంగడాలతో గతేడాది వరంగల్‌లో ప్రయోగాత్మకంగా పత్తిసాగు చేపట్టారు. ఈ వానాకాలంలో ఖమ్మం జిల్లాలోనూ రైతులతో ఈ పంటను సాగు చేయించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకు వీలుగా ఉన్న విత్తనాల సమకూర్పు, అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుత సాధారణ సాగు విధానంలో ఎకరానికి 6వేల నుంచి 7 వేల విత్తనాలు నాటుతున్నారు. రెండు విత్తన ప్యాకెట్లు వాడుతున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. రెంటిండి ధర రూ. 1550 అవుతోంది. కానీ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఒకే కోత వంగడాలను ఎకరానికి 16వేల నుంచి 20వేల వరకు విత్తారు. ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ సీజనలో ఎకరానికి 16,500 నాటారు.ఒక్కో మొక్కకు 20కి తగ్గకుండా కాయలు వచ్చాయని, ఒక్కో కాయపగిలి కనీసం 4గ్రాముల దూది వస్తుంది అంచనా వేశారు. ఈ లెక్కన 16,500పత్తి మొక్కల నుంచి కనీసం 13నుంచి 15 క్వింటాళ్ల దూదిని ఒకే సారి తీయొచ్చని వ్యవసాయ వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు. ఈ విధానం మీద ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి, వ్యవసాయ అధికారికి కలిసి దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు.


రైతులకు లాభం చేకూర్చేందుకు పరిశోధనలు

విజయనిర్మల, జిల్లా వ్యవసాయాధికారి

అన్నదాతకు అధిక దిగుబడి వచ్చేలా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఒకే సారి సేకరించే విధంగా పత్తి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ వానాకాలం జిల్లాలో సాగు చేయించాలనుకుంటున్నాం. ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలి.

Read more