బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్కు పనులను పూర్తిచేయండి

ABN , First Publish Date - 2022-06-08T05:18:19+05:30 IST

బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్కు పనులను పూర్తిచేయండి

బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్కు పనులను పూర్తిచేయండి
ప్రగతిభవన్‌లో కేటీఆర్‌, తుమ్మల, పనులు నిలిచిన సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగాఫుడ్‌పార్కు

ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కోరిన మాజీమంత్రి తుమ్మల

తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన కేటీఆర్‌

ప్రగతిభవన్‌లో భేటీ అయిన ఇద్దరు నేతలు

ఖమ్మం, జూన 7(ఆంధ్రజ్యోతిప్రతినిధి): సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 200ఎకరాల్లో ఏర్పాటుచేసిన మెగాఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు పనులను అసంపూర్తిగా వదిలివేశారని, పెండింగ్‌ పనులను పూర్తిచేసి ఈ పార్కును వినియోగంలోకి తేవాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మునిసిపల్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. మంగళవారం హైదరాబాద్‌ ప్రగతిభవనలో కేటీఆర్‌తో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సత్తుపల్లి బుగ్గపాడు మెగాఫుడ్‌పార్కు సమస్యను తుమ్మల విరవించారు. ఉమ్మ డి రాష్ట్రం ఉన్నప్పుడు రైతుల కోసం 2008లో మెగాఫుడ్‌పార్కు మంజూరుచేయడం జరిగిందని,  200ఎకరాల్లో ఈపార్కు పనులు జరిగాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈపార్కు ఒక వరంగా రైతులకు ఉంటుందని భావించామని తుమ్మల తెలిపారు. 2016నవంబరు 13న మీ చేతులమీదగా శంకుస్థాపన చేశామని, ఫుడ్‌పార్కు నిర్మాణ పనులు పూర్తిచేయలేదని, ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా పరిస్థితి తయారైందని తుమ్మల పేర్కొన్నారు. రైతులకు మేలు జరిగేలా ఈ ఫుడ్‌ పార్కు పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని, జామ, మామిడి ప్రాసెసింగ్‌యూనిట్లను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌ సత్తపల్లి మెగాఫుడ్‌పార్కుకు సంబంధించి తగిన చర్యలు చేపడతామని, అన్ని పనులు పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామని తుమ్మలకు హామీ ఇచ్చారు.

Read more