అడవిని ఖాళీ చేయండి

ABN , First Publish Date - 2022-11-27T22:09:50+05:30 IST

భద్రాద్రి జిల్లా చండ్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో ఆ మండలంలోని బెండాలపాడు అడవుల్లో (ఎర్రబోడు) నివాసం ఉంటున్న గొత్తికోయలపై నిర్భంధం పెరిగింది. చండ్రుగొండ రేంజర్‌ శ్రీనివాసరావును గొత్తికోయలే హత్య చేశారని భావిస్తున్న అటవీ అధికారులు ఆ గ్రామ పరిధిలోని గొత్తికోయలు అడవిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదివారం నోటీసులు జారీ చేశారు.

అడవిని ఖాళీ చేయండి
గొత్తికోయ మహిళకు నోటీసులు అందజేస్తున్న అటవీ అధికారులు

బెండాలపాడు గొత్తికోయలపై పెరిగిన నిర్బంధం

అడవినుంచి వెళ్లిపోవాలని ఫారెస్ట్‌ అధికారుల నోటీసులు

ఎర్రబోడుకు బయటవారు రాకుండా పోలీసుల పహారా

గుర్తింపుకార్డులు ఉంటేనే మీడియాకు అనుమతి

చండ్రుగొండ, నవంబరు 27: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో ఆ మండలంలోని బెండాలపాడు అడవుల్లో (ఎర్రబోడు) నివాసం ఉంటున్న గొత్తికోయలపై నిర్భంధం పెరిగింది. చండ్రుగొండ రేంజర్‌ శ్రీనివాసరావును గొత్తికోయలే హత్య చేశారని భావిస్తున్న అటవీ అధికారులు ఆ గ్రామ పరిధిలోని గొత్తికోయలు అడవిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదివారం నోటీసులు జారీ చేశారు. బెండాలపాడు అడవుల్లో గత 24ఏళ్లుగా 40కుటుంబాలకు చెందిన సుమారు 200మంది గొత్తికోయలు ఛత్తీస్‌గఢ్‌నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఓటు హక్కును కల్పించింది. ఆధార్‌ కార్డులు కూడా మంజూరు చేసింది. అయితే రేంజర్‌ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో అటు అటవీ అధికారులతో పాటు స్థానిక ప్రజలు సైతం వీరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గొత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఇప్పటికే అక్కడి ప్రజలు గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ క్రమంలో అటవీ అధికారులు సైతం వీరు అటవిని వదిలి వెళ్లిపోవాలని ఆదివారం నోటీసులు జారీ చేశారు. పోలీసులు సైతం గొత్తికోయలు నివాసం ఉండే (ఎర్రబోడు) ప్రాంతంలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో గొత్తికోయలను కలిచేందుకు తుడుందెబ్బ సంఘం నాయకులు గ్రామానికి రావడంతో ఈ సమాచారం నిమిషాల్లో చండ్రుగొండ పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని తుడుందెబ్బ నాయకులను వెనక్కు పంపించి వేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులను సైతం పోలీసులు నిలిపేసి గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతనే అడవీలోకి అనుమతించారు. ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఎఫ్‌డీవో అప్పయ్యను వివరణ కోరగా సాధారణంగా అడవులను అక్రమించుకునేవారికి నోటీసులు జారీచేస్తామని, అందులో భాగంగానే ఎర్రబోడు వాసులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2022-11-27T22:09:51+05:30 IST