సవాలుగా స్థల సేకరణ

ABN , First Publish Date - 2022-09-09T05:16:46+05:30 IST

దేహదారుడ్యం, మానసిక ఉల్లాసంకోసం, క్రీడాకారులకు అందుబాటులో ఉంచేందుకు ఊరికో క్రీడా ప్రాంగణం నిర్మించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలకు పూనుకుంది.

సవాలుగా స్థల సేకరణ
జూలూరుపాడుకి దూరంగా నిర్మించిన క్రీడా ప్రాంగణం

 అభ్యంతరాల క్రీనీడలో క్రీడామైదానాల నిర్మాణాలు

 పాఠశాలల్లో మైదానాల ఏర్పాటుపై అభ్యంతరాలు

 పేద రైతుల స్థలాల సేకరణపై వివాదం

  రెవెన్యూశాఖకు అగ్ని పరీక్ష

జూలూరుపాడు, సెప్టెంబరు 8: దేహదారుడ్యం, మానసిక ఉల్లాసంకోసం, క్రీడాకారులకు అందుబాటులో ఉంచేందుకు ఊరికో క్రీడా ప్రాంగణం నిర్మించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలకు పూనుకుంది. ఈ నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి అప్పగించే బాధ్యతను రెవెన్యూశాఖకు అప్పగించింది. వీటి నిర్మాణాల బాధ్యతను పంచాయతీకి కేటాయించింది. ఈజీఎస్‌ వారి పర్యవేక్షణలో మైదానాలను నిర్మించాల్సి ఉంది. జూలూరుపాడు మండలంలోని 24 పంచాయతీల పరిధిలో 64 గ్రామాలు ఉన్నా యి. ఈ గ్రామాలన్నింటిలో క్రీడామైదానాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఒక్కొక్క క్రీడామైదానానికి గాను అర ఎకరం నుంచి ఎకరం దాక ప్రభుత్వ భూమిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ కోర్టులతోపాటు వ్యాయామానికి సంబంధించి సింగల్‌బార్‌, డబుల్‌ బార్‌ స్టాండ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

స్థలం కొరత

గ్రామాల్లో జాగ దొరకడమే గగనమవుతోంది. దీంతో ఇప్పటి వరకు కేవలం 9 గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేసినప్పటికి 7 గ్రామాల్లోనే నిర్మాణాలకు స్థలాలను అప్పగించారు. పేద రైతులు భూములను ఎంపిక చేయడం పట్ల వివాదాలు తలెత్తుతున్నాయి.  ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం జూలూరుపాడు, పడమట నర్సాపురం గ్రామాల్లోనే క్రీడా ప్రాంగణ నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అన్నారుపాడు, బోజ్యాతండా, గుండెపూడి, శంభూనిగూడెం గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించిన స్థల సేకరణ రెవెన్యూశాఖకు తలకుమించిన భారంగా పరిణమించింది. గ్రామాల్లో స్థలాలను గుర్తించేందుకు అగ్ని పరీక్షను ఎదుర్కొవల్సి వస్తుందని రెవె న్యూ సిబ్బంది వాపోతున్నారు. గ్రామాల్లో ఖాళా స్థలాలు దొరక్కపోవడం, ఒక వేళ దొరికినా అవి ఊరికి దూరంగా ఉండటంతో దూరాన గల క్రీడా మైదానాలకు ప్రజలు వెళ్లటానికి మొగ్గుచూపే పరిస్థితి లేదు. దీంతో ఇవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.

అభ్యంతరాల క్రీనీడ..

ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించే ఖాళీ ప్రదేశాల్లో మైదానాలను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తుండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాపకొల్లు, జూలూరుపాడు ఉన్నత పాఠశాలల ఆవరణల్లో గల స్థలాన్ని క్రీడామైదానాల నిర్మాణం కోసం అధికారులు ఎంపిక చేశారు. దీంతో పాపకొల్లు పాఠశాల ఆవరణలో క్రీడామైదానం ఏర్పాటు చేయ వద్దంటూ ఆ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ అడ్డుకున్నారు. దీంతో వివాదం చోటుచేసుకోవడంతో పనులను ప్రారంభించలేదు. 

లక్ష్య సాధనలో ఎడతెగని జాప్యం..

 ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించడంలో ఎదురవుతున్న అవరోదాలకారణంగా క్రీడామైదాన  నిర్మాణాల ఏర్పాటులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. మూడు నెలల నుంచి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి స్థలాల సేకరణ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టినప్పటికీ 50శాతం మైదానాల నిర్మాణాలకు స్థలాన్ని గుర్తించలేదు. సవాళ్లన్నింటిని అధిగమించి స్థలాలను సేకరించి పూర్తిస్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయటానికి ఎంతకాలం పడుతుందో వేచి చూడాల్సిందే..

స్థలాలను అప్పగించాలని కోరాం..

 తాళ్లూరి రవి, ఎంపీడీవో జూలూరుపాడు

క్రీడామైదానాల ఏర్పాటుకు త్వరితగతిన స్థలాలను గుర్తించి అప్పగించాలని రెవిన్యూశాఖాధికారులను కోరినట్లు తెలిపారు. వారు స్థలాలను ఇవ్వగానే పనులను చేపడతాం. త్వరితగతిన అన్ని గ్రామాల్లో క్రీడామైదానాల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. 


Read more