బీసీల పట్ల కేంద్రానిది నిర్లక్ష్యవైఖరి
ABN , First Publish Date - 2022-07-05T06:43:30+05:30 IST
బీసీల పట్ల కేంద్రానిది నిర్లక్ష్యవైఖరి

‘డబుల్ ఇంజిన్’కు పట్టాలేస్తే రాష్ట్ర ప్రజలు పీకేస్తారు
బీజేపీపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు
సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ
ఖమ్మం కార్పొరేషన్, జూలై 4 : కేంద్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని, కనీసం బీసీ మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేయలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు డొడ్డి కొమరయ్య విగ్రహాన్ని సీపీఐ జాతీయనేత, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ కులగణన పట్ల కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీసీలంతా ఒక్క తాటిపై ఉండి బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణా తొలి, మలి ఉద్యమాల్లో పాల్గొనని బీజేపీ నేతలు అధికారం కోసం వంగి వంగి దండాలు పెడుతున్నారని, వారిని నమ్మితే ప్రజలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. డబుల్ఇంజన ప్రభుత్వానికి పట్టాలు వేస్తున్నామని ప్రధాని మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రకటించటం హాస్యాస్పదమని, బీసీలకు ఏం చేశారని వారు డబుల్ఇంజనకు పట్టాలు వేస్తే తెలంగాణ ప్రజలు వాటి పెకిలించివేస్తారన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదగటం కేంద్రప్రభుత్వానికి ఇష్టంలేదని, అందుకే రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి మోకాలొడ్డి, దానికి సంబంధించి రూ.3,700 కోట్లు రుణం విడుదల చేయటం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ బీసీలకు ఎంతో గుర్తింపునిచ్చారని, కేంద్రం సహకరించకున్నా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌పై కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. డొడ్డి కొమరయ్య పోరాటస్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, యాదవ సంఘం నాయకులు మేకల మల్లిబాబు యాదవ్, చిలకల వెంకటనర్సయ్య, జడ్పీటీసీ చింతలచెరువు లక్ష్మి, మేకల సుగుణారావు, తదితరులు పాల్గొన్నారు.