రేపటినుంచి భద్రాద్రి కప్‌

ABN , First Publish Date - 2022-02-19T06:33:18+05:30 IST

రేపటినుంచి భద్రాద్రి కప్‌

రేపటినుంచి భద్రాద్రి కప్‌
పిచ్‌ని సిద్ధం చేస్తున్న దృశ్యం, భద్రాద్రి కప్‌ విన్నర్స్‌, రన్నర్స్‌కు అందజేసే ట్రోఫీలు

మార్చి మూడు వరకు పోటీల నిర్వహణ 

విజేతకు రూ.లక్ష, రన్నర్స్‌కు రూ.70వేల బహుమతి

పదేళ్ల తరువాత ఏజెన్సీ క్రికెట్‌ టోర్నీ పునఃప్రారంభం

భద్రాచలం, ఫిబ్రవరి 18: భద్రాచలం ఏజెన్సీలో నిర్వహిస్తున్న ‘భద్రాద్రి కప్‌’ జాతీయస్థాయి ఇన్విటేషన్‌ ప్రైజ్‌మనీ క్రికెట్‌టోర్నీ ఆదివారం ప్రారం భం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో 1991-92లో భద్రాద్రి కప్‌కు శ్రీకారం చుట్టగా రెండు దశాబ్ధాల పాటు ఎందరో జాతీయస్థాయి క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో భద్రాద్రికప్‌ క్రికెట్‌ పోటీలు ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయి. 21వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆదివారం ప్రారంభమై మార్చి మూడో తేదీన ముగుస్తుంది. ఇందుకోసం భద్రాద్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

ఈసారి జరుగుతున్న పోటీలను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్‌-ఏలో హైదరాబాద్‌ మావిరక్స్‌, గో స్పోర్ట్స్‌ ఆంధ్రా, తూర్పుగోదావరి జట్లు ఉండగా పూల్‌-బీలో ఏడీకింగ్స్‌ తమిళనాడు, డ్రీమ్‌ క్రషర్స్‌, వారియర్స్‌ వైజాగ్‌, పూల్‌-సీలో సిరిఆసుపత్రి ఒంగోలు, తెలంగాణ జాగృతి, ఎంవైసీసీ, ముంబాయి, పూల్‌-డీలో జేఆర్‌సీసీ ఒడిశా, ఆర్‌డీటీ ఏడీసీ అనంతపూర్‌, బీసీ భద్రాచలం జట్లున్నాయి. 

విజేతకు రూ.లక్ష ప్రైజ్‌మనీ

భద్రాద్రి కప్‌లో ఫ్రైజ్‌మనీ విలువ క్రమేపీ పెరుగుతోంది. ఆరంభంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.10వేలు, రన్నర్స్‌గా నిలిచిన జట్టుకు రూ.5వేలు అందించేవారు. 1995లో విజేతలకు రూ.15వేలు, రన్నర్స్‌కు రూ.10వేలు ఇచ్చారు. 2009లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.50వేలు, రన్నర్స్‌గా నిలిచిన జట్టుకు రూ.30వేలు అందించారు. సెమీఫైనల్‌లో ఓడిన రెండుజట్లకు రూ.10వేల చొప్పున అందిస్తున్నారు. చివరి సారిగా ఈ టోర్నీని 2012లో నిర్వహించారు. అప్పటినుంచి దశాబ్ధకాలం పాటు ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈసారి నిర్వహిస్తున్న పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.లక్ష, రోలింగ్‌ ట్రోఫీ, రన్నర్స్‌గా నిలిచిన జట్టుకు రూ.70వేలు, రన్నర్స్‌ ట్రోపీ అందించనున్నారు. అలాగే సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు రూ.15వేల చొప్పున ప్రైజ్‌మనీ అందించనున్నారు. 

Updated Date - 2022-02-19T06:33:18+05:30 IST