అడుగడుగునా అడ్డంకులు

ABN , First Publish Date - 2022-08-17T05:38:01+05:30 IST

గోదావరి ముంపు ప్రాంతాల పర్యటనకు గాను మంగళవారం భద్రాచలం ఏజెన్సీకి వచ్చిన సీఎల్పీ బృందానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. తొ

అడుగడుగునా అడ్డంకులు
ఆందోళన చేస్తున్న సీఎల్పీ బృందం సభ్యులు

ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటనకు పోలీసుల ఆంక్షలు

దుమ్ముగూడెం ప్రాజెక్టు వైపునకు వెళ్లనీయకుండా అడ్డగింత

మూడుగంటల పాటు బైఠాయింపు

పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం 

బూర్గంపాడు వెళుతున్న క్రమంలోనూ అదే పరిస్థితి 

మణుగూరు క్రాస్‌ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని పాల్వంచకు తరలించిన పోలీసులు

భద్రాచలం /బూర్గంపాడు, ఆగస్టు 16: గోదావరి ముంపు ప్రాంతాల పర్యటనకు గాను మంగళవారం భద్రాచలం ఏజెన్సీకి వచ్చిన సీఎల్పీ బృందానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. తొలుత భద్రాద్రి రామయ్యను దర్శించుకొని పట్టణంలోని విస్తా కాంప్లెక్స్‌, సుభాష్‌నగర్‌ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవనరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు దుమ్ముగూడెం పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో వారిని రాజుపేట వద్ద భద్రాచలం ఏఎస్పీ రోహితరాజ్‌ నేతృత్వంలో పోలీసులు డీసీఎం, పోలీసు వాహనాలు, ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవనరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు మూడుగంటలపాటు రహదారిపై బైఠాయించారు. అయితే వారి అడ్డగింతకు పోలీసులు పొంతన లేని సమాధానం చెప్పడంతో సీఎల్పీ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దుమ్ముగూడెం పరిసరాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నాయన్న నిఘావర్గాల హెచ్చరిక నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అనుమతించడం లేదని పోలీసులు చెప్పడంతో నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఏం రక్షణ ఇస్తుందని ప్రశ్నించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టులో లోపాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుంటోందని ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పోలీసులు గుర్రాలబైలు గ్రామం మీదుగా వారిని దుమ్ముగూడెం తీసుకెళ్తామని చెప్పడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాహనాలు ఎక్కి ఆ గ్రామానికి వెళ్లారు. అయితే అప్పటికే వందల సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి ఆ దారిగుండా వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ బృందం తిరిగి భద్రాచలం వెళ్లింది. ఆ తర్వాత బూర్గంపాడు మండలంలోని సారపాకలో గల సుందరయ్యనగర్‌ కాలనీని సందర్శించింది. అక్కడి నుంచి అశ్వాపురం పర్యటనకు వెళ్లేందుకు సీఎల్పీ బృందం ప్రయత్నించగా పోలీసులు బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో నాయకులు అక్కడ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపారు. పోలీసులు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు ఉద్రిక్తత తలెత్తగా.. భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ అక్కడికి చేరుకుని సీఎల్పీ బృందంతో చర్చలు జరిపారు. అయినా వారు వినకపోవడంతో బలవంతంగా వారిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు సీఎల్పీ బృందాన్ని అరెస్టు చేసి పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా కారణంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా గోదావరి ముంపు ప్రాంతాల్లో జరిగిన సీఎల్పీ బృంద పర్యటనకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన గైర్హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తన నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రతో తీవ్ర అలసటకు గురై రాలేకపోయారని సమాచారం. 

 మణుగూరు క్రాస్‌ రోడ్డు వద్ద సీఎల్పీ బృందం ఆందోళన 

అశ్వాపురం పర్యాటనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో నాయకులు రోడ్డుపై బైఠాయించి పోలీసుల నిర్బంద వైఖరికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దౌర్జన్యం నశించాలి... సీఎం కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాధాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత తలెత్తింది. భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని సీఎల్పీ బృందంలో చర్చలు జరిపారు. అయినా వారు వినకపోవడంతో బలవంతంగా వారిని పక్కకు తప్పించారు. ఈ క్రమంలో  కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్ధితుల మధ్య పోలీసులు సీఎల్పీ బృందాన్ని అరెస్టు చేసి పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద సీఎల్పీ బృందం ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మణుగూరు క్రాస్‌ రోడ్డు వద్ద భద్రాచలం, మణుగూరు, పాల్వంచ వైపు నుంచి వచ్చే, వెళ్లే ఎక్కడికక్కడే నిలిచిపోయి కిలోమీటర్లు బారులు తీరాయి. దాంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   

ఇదిలా ఉండగా గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష బృందంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన గైర్హాజరు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆయన తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి తీవ్ర అలసటకు గురవ్వడంతో పర్యటనకు రాలేకపోయారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. 

Read more