యూపీవాసులపై గ్యాంగ్‌ ఎటాక్‌

ABN , First Publish Date - 2022-12-09T23:28:14+05:30 IST

బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఖమ్మం నగరానికి వచ్చి దుస్తుల వ్యాపారం చేస్తున్న ముగ్గురిపై గురువారం అర్ధరాత్రి సుమారు 20మంది యువకులు కర్రలు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

యూపీవాసులపై గ్యాంగ్‌ ఎటాక్‌
సీసీ కెమేరాలో రికార్డు అయిన దృశ్యం

ఖమ్మం క్రైం, డిసింబరు 9: బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఖమ్మం నగరానికి వచ్చి దుస్తుల వ్యాపారం చేస్తున్న ముగ్గురిపై గురువారం అర్ధరాత్రి సుమారు 20మంది యువకులు కర్రలు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల కథనం ప్రకారం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కుబేర్‌సింగ్‌ నాయక్‌, ఆయన కుమారులు రోహిత్‌ సింగ్‌, తిలక్‌సింగ్‌ నాయక్‌ లు నగరంలోని మామిళ్లగూడెం బ్రిడ్జి సమిపంలో అద్దెకు ఉంటున్నారు. గురువారం రాత్రి అద్దెకు ఉండే ఇంటి ముందు తమ ద్విచక్ర వాహనాలను నిలిపి లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో పాత మునిసిపాలిటీ సమీప ప్రాంతానికి చెందిన హజ్జా, ఫైజన్‌, ఆధిల్‌, ముఖీమ్‌.. బైక్‌ల వద్దకు వచ్చి వాటిలోని పెట్రోల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. అది గమనించిన కుబేర్‌సింగ్‌ నాయక్‌ కుమారులతో కలిసి బయటకు వచ్చి ఎందుకు పెట్రోల్‌ తీస్తున్నారని ప్రశ్నించగా ఆ యువకులు బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 30 నిమిషాల తరువాత ఆ యువకులతోపాటు సుమారు 20మంది వచ్చి కుబేర్‌సింగ్‌ నాయక్‌ ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ముగ్గురుపై విచక్షణారహితంగా దాడి చేశారు. భయంతో వారు పారిపోతుండగా తలుపులు పగలగొట్టి బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. ప్రాణభయంతో బయటకు వచ్చి పొరుగున ఉన్న వారి ఇళ్లోకి పరిగెత్తగా.. అక్కడికి కూడా ఆ యువకులు వెళ్లి దాడి చేశారు. ఈసంఘటన చూసిన స్థానికులు అక్కడికి రాగా దాడి చేస్తున్న యువకులు పారిపోయారు. ఇరుగుపొరుగు వారు గాయనడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేంద్ర మంత్రి ఆరా..

దాడి ఘటనపై కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ, ఆగ్రా సమీపంలోని శంషాబాద్‌ ఎమ్మెల్యే చోటీలాల్‌ బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గల్లా సత్యనారాయణ శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ, ఎమ్మెల్యే చోటీలాల్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గల్లా డిమాండ్‌ చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి టు టౌన్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే విషయం తెలిసిన టు టౌన్‌ సీఐ శ్రీధర్‌ ఉదయాన్నే సంఘటన స్థలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన సంఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డవగా.. నిందితులు పరారీలో ఉన్నట్లు ఖమ్మం త్రీ టౌన్‌ సీఐ శ్రీధర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-09T23:28:15+05:30 IST