యువకుడి హత్యకేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-12T23:13:06+05:30 IST

ముత్యాలంపాడుక్రాస్‌రోడ్డులో ఆదివారం జరిగిన దారావత్‌ అశోక్‌ హత్యకేసులో నిందితుడిని టేకులపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

యువకుడి హత్యకేసులో నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి

టేకులపల్లి, డిసెంబరు 12: ముత్యాలంపాడుక్రాస్‌రోడ్డులో ఆదివారం జరిగిన దారావత్‌ అశోక్‌ హత్యకేసులో నిందితుడిని టేకులపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టేకులపల్లి పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. మృతుడు టేకులపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన దారావతు అశోక్‌, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డుకు చెందిన నిందితుడు ప్రేమ్‌కుమార్‌ మధ్య ఆర్ధిక లావాదేవీలతో పాటు ప్రేమ్‌కుమర్‌ అక్కకు, మృతుడు అశోక్‌కు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఇది ఇంట్లో తెలియడంతో ప్రేమ్‌కుమర్‌ అక్కను పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. అశోక్‌ వేరే అమ్మాయిని వివాహం చేసుకొన్నాడు. ఇటీవల అశోక్‌కు కూతురు జన్మించింది. అయితే తన అక్కను ప్రేమించి మోసగించిన అశో క్‌ భార్యాపిల్లలతో సంతోషంగా ఉండటాన్ని ప్రేమ్‌కుమార్‌ సహించలేకపోయాడు. ఈ క్రమంలో ఆర్థికలావాదేవీల విషయంలో ఇటీవల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో అశోక్‌పై నిందితుడు ప్రేమ్‌కుమార్‌ కక్ష పెంచుకొన్నాడు. ఈ క్రమంలో అశోక్‌కి గతంలో ఇవ్వాల్సిన రూ.60 వేలు ఇస్తానని నమ్మించి ముత్యాలంపాడుక్రాస్‌రోడ్డు పాఠశాల వద్దకు రమ్మని పిలిచాడు. ముందే అశోక్‌ను చంపాలనుకొన్న ప్రేమ్‌కుమార్‌ పథకం ప్రకారం అక్కడికి వచ్చిన అశోక్‌ను రాడ్డుతో తలపై కొట్టిడాడు. దాంతో అతడు కిందపడిపోవడంతో వెంటనే కత్తితో అతి కిరాతకంగా హత్యచేశాడు. హత్యకు ఉపయోగించిన రాడ్డు, కత్తితో పాటు ప్రేమ్‌కుమార్‌ వద్ద ఉన్న అశోక్‌కు చెందిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడు ప్రేమ్‌కుమార్‌ అలి యాస్‌ కిట్టును అరెస్టుచేసి కోరులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. క్లూస్‌టీం వేలిముద్రల ఆఽదారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:13:06+05:30 IST

Read more