అక్కరకు రాని ఆదర్శం

ABN , First Publish Date - 2022-10-12T05:52:59+05:30 IST

ప్రైసూతి వైద్యంలో ఆదర్శంగా నిలుస్తున్న భద్రాచలం ఏరియా వైద్యశాలకు పూర్తిస్థాయి ప్రసూతి వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం ఈ ఆసుపత్రి పట్ల పా

అక్కరకు రాని ఆదర్శం

ప్రసూతి వైద్య సేవల్లో మేటి

రికార్డుస్థాయిలో ప్రసవాలు 

అయినా పూర్తిస్థాయి వైద్య సిబ్బంది కరువు

తాత్కాలిక వైద్యులతోనే సేవలు

వైద్యుల నియామకాలపై దృష్టిసారించని సర్కార్‌

ఇదీ భద్రాచలం ఏరియా వైద్యశాల దుస్థితి 

భద్రాచలం, అక్టోబరు 11: ప్రైసూతి వైద్యంలో ఆదర్శంగా నిలుస్తున్న భద్రాచలం ఏరియా వైద్యశాలకు పూర్తిస్థాయి ప్రసూతి వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం ఈ ఆసుపత్రి పట్ల పాలకులు, అధికారుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రైవేటు వైద్యశాలల్లో సిజేరియన్ల సంఖ్య (సీ సెక్షన) ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారుల సమీక్షలో రెండు రోజుల క్రితం ఒక వైపు వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గత నెలలో ఎనిమిది జిల్లాల్లోని ప్రైవేటు వైద్యశాలల్లో 58శాతం సిజేరియన్లు నిర్వహించగా అందులో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు సైతం ఉన్నాయి. అయితే ఈ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు ఎందుకు జరగడం లేదని మంత్రి ప్రశ్నించారు. అయితే ప్రసవాల్లో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రథమం, ద్వితీయ స్థానాల్లో భద్రాద్రి ఏరియా వైద్యశాల నిలిచింది. 200పడకలకు పైగా ఉన్న ఈ వైద్యశాలలో వాస్తవానికి 12మంది ప్రసూతి వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా రెగ్యులర్‌ ప్రసూతి వైద్యులు లేరంటే ఆశ్చర్యం కలగక మానదు. నాలుగు రాషా్ట్రల సరిహద్దుల్లో ఉన్న భద్రాద్రి వైద్యశాలలో ప్రసవం కోసం వందలాది మంది తరలివస్తూ ఉంటారు. ఇందుకు అవసరమైన ప్రసూతి వైద్యుల నియామకం పట్ల ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని వైద్యశాలల్లో ప్రసూతి వైద్యుల సంఖ్య గణనీయంగా ఉన్నా అక్కడ ఆ స్థాయిలో ప్రసవాలు నిర్వహించని పరిస్థితి ఉంది. అవసరమైన చోటేమో కనీసం ఒక్కరిని కూడా నియమించకపోవడం ఎంత వరకు సమంజసమని భద్రాద్రివాసులు ప్రశ్నిస్తున్నారు. 

పొగడ్తలకే పరిమితమవుతున్న పాలకులు

భద్రాచలం వైద్యశాలలో నిర్వహిస్తున్న ప్రసవాలు రాషా్ట్రనికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గత కొన్నేళ్లుగా రాష్ట్రవైద్యశాఖ మంత్రులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులు, కమిషనర్లు కీర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే వారి అభినందనలు మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప వైద్యుల నియామకంలో మాత్రం కనీసం దృష్టిసారించడం లేదు. గత ఆరు నెలలుగా ప్రసూతి వైద్యసేవలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారీ దవాఖానాను ఆశ్రయిస్తున్న నిరుపేదలకు కష్టాలు తప్పడం లేదు. ప్రసూతి వైద్యులు లేకపోవడంతో భద్రాద్రి వైద్యశాల అధికారులు ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేయడంతో అంత దూరానికి వెళ్లలేక నిరుపైదలు భద్రాద్రిలోని ప్రైవేటు ప్రసూతి వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా ప్రసూతి వైద్యులు సిజేరియన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కొక్కరి నుంచి రూ.20నుంచి రూ.25వేల వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్థిక భారమైనా తప్పనిసరి పరిస్థితుల్లో నిరుపేదలు అప్పులు చేసి మరీ ప్రైవేటు వైద్యశాలలకు ముట్టజెబుతున్న పరిస్థితులు లేకపోలేదు. ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యశాలలో(ఎంసీహెచ) 12మంది ప్రసూతి వైద్యులు ఉండగా, భద్రాద్రిలో ఒక్కరు కూడా లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమని భద్రాద్రివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రసవాలు కూడా భద్రాద్రిలో గతంలో నిర్వహించినంతగా లేవని వినికిడి. వాస్తవానికి అక్కడున్న వైద్యుల సంఖ్య ఆధారంగా ప్రసవాలు వెయ్యికి పైనే దాటాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అశ్వారావుపేట, ఇల్లెందు వైద్యశాలల్లో సైతం కనీసం ఒక్కరు కూడా ప్రసూతి వైద్యులు లేరని వైద్య వర్గాలే వాపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యాన్ని ఆశ్రయించిన వారికి ప్రసవాలు ఏ విధంగా సాధ్యమనే ప్రశ్న సైతం తలెత్తుతోంది.  

అందరికీ అంతా తెలుసు.. ఎవరూ పట్టించుకోవడం లేదు

- భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాద్రి వైద్యశాల పరిస్థితి గురించి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి అంతా తెలుసు.. అయినా ఎవరు పట్టించుకోడం లేదు. ఏరియా వైద్యశాలలో సమస్యలు, వైద్యులు, సిబ్బంది నియామకంపై పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించా. గర్భిణులకు స్కానింగ్‌లు నిర్వహించడానికి అందుబాటులో స్కానింగ్‌ విభాగం ఉన్నా భద్రాద్రిలో రేడియాలజిస్టు లేకపోవడంతో ఆరు నెలలుగా మూసి ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. 

Read more