ముందుంది ముంపుకాలం!
ABN , First Publish Date - 2022-06-08T05:15:48+05:30 IST
ముందుంది ముంపుకాలం!

పక్కా కార్యాచరణతోనే గోదావరి వరదల నుంచి రక్షణ
పరివాహక ప్రాంతాలకు ఆ మూడునెలలు ఎంతో కీలకం
భద్రాచలంలో స్లూయిజ్‌ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
వానాకాలం ముంచుకొస్తున్నా.. ముందస్తు సమీక్షపై దృష్టిపెట్టని అధికార యంత్రాంగం
భద్రాచలం, జూన 7: రాబోయే మూడు నెలలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎంతో కీలకమైన సమయం. జూలై నుంచి సెప్టెంబరు వరకు గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. ముందస్తు కార్యాచరణతోనే ఈ వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొనే అవకాశముంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం జూన ఆరంభంలోనే జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కసరత్తు ప్రారంభిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు ముందస్తున్న కసరత్తుపై ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. రాబోయే మూడు నెలలు వరదలు, వ్యాధులపరంగా ఎంతో కీలకం కావడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేసి మరింత పకడ్బందీగా సేవలందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాల్సి ఉంది. గోదావరి ఫ్లడ్ మాన్యూల్లో పేర్కొన్నట్లు జూన ఆరంభంలోనే జిల్లాస్థాయిలో గోదావరి వరదలపై ముందస్తున్న సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
మొదటి ప్రమాద హెచ్చరికతోనే...
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక (43అడుగులు)కు చేరుకోగానే మొబైల్ టీం అధికారులు భద్రాచలం సబ్‌కలెక్టర్‌కు రిపోర్టు చేసి సన్నద్దం కావాలి. భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరగానే అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం జూనలో నిర్వహించే ముందస్తున్న సమీక్ష సమావేశం ఎంతో కీలకం కానుంది. వరదల సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిత్యవసర సరుకుల కొరత రాకుండా మూడు నెలలకు సరిపడే బఫర్ స్టాక్‌ను నిర్దేశించిన ప్రాంతాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఈ స్టాక్‌ను భద్రపరిచే సమయంలో అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో పలు సందర్భాల్లో వర్షాలూ వరదలకు కొన్ని చోట్ల దాచిన బఫర్‌స్టాక్ తడిచిన ఘటనలున్నాయి.
స్లూయిజ్ సమస్యకు పరిష్కారం ఏదీ ?
భద్రాచలం పుణ్యక్షేత్రానికి గోదావరి ముంపు నుంచి విముక్తికోసం వరద కరకట్టను నిర్మించారు. ఇంత వరకు బాగానే ఉన్నా వర్షాలు, వరదల సమయంలో స్లూయి్‌సలను మూసివేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. ముఖ్యంగా విస్తా కాంప్లెక్స్, అశోకనగర్ కొత్తకాలనీ స్లూయి్‌సల వద్ద మురుగునీరు, వర్షపునీరు లిఫ్ట్ చేసేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది స్లూయి్‌సల నుంచి లీకులు రాకుండా చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటుండగా చివరకు మురుగునీరును సైతం పూర్తిస్థాయిలో లిఫ్ట్ చేసి ఎత్తిపోయకపోవడంతో చప్టా, దిగువ, దేవస్థానం ఉచిత నిత్యన్నదాన సత్రం పరిసరాల్లోకి మోకాలి లోతులో మురుగునీరు చేరింది. అలాగే అశోకనగర్ కొత్తకాలనీలో సైతం ఇదే పరిస్థితి ఉంది. విస్తాకాంప్లెక్స్ వద్ద 50 హెచపీ సామర్థ్యం గల ఆరు మోటార్లు ఉండగా అందులో నాలుగు పాత మోటార్లే ఉన్నాయి. దీంతో అత్యవసర సమయంలో మురుగునీటిని ఆ మోటార్ల ద్వారా ఎత్తిపోయడం కష్టసాధ్యంగా మారుతోంది. మురుగునీటిని సైతం ఎత్తిపోసే విధంగా మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటిని సైతం నిరాటంకంగా తోడే 100హెచపీ మోటార్లు నాలుగు ఏర్పాటు చేస్తేనే రామాలయం పరిసర ప్రాంతాల్లో మురుగునీరు ఎత్తిపోసే పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉండే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అధికార యంత్రాంగం ఆలోచించకపోవడం పట్ల ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.
సెక్టోరియల్, జోనల్ అధికారులదే కీలక బాధ్యత
గోదావరి వరద ముంపును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సెక్టోరియల్, జోనల్ అధికారులదే కీలక పాత్ర. వారు సమర్ధవంతంగా పని చేస్తేనే ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో కాపాడేందుకు అవకాశం ఉంటుంది. మండలస్థాయిలోనూ వరద సమీక్షలు నిర్వహించి మండల అధికారులను సన్నద్దం చేయాల్సి ఉంది. వరదల సమయంలో సమాచార వ్యవస్థ ఎంతో కీలకం కావడంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలి. ఇక పరివాహక ప్రాంతంలో గర్భిణులను గుర్తించి వారిలో వచ్చే మూడు నెలల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్న వారిని గుర్తించి వారిని అత్యవసర సమయాల్లో సమీప వైద్యశాలలకు తరలించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలి.