విద్యార్థి కంట్లో గుచ్చుకున్న పెన్సిల్‌

ABN , First Publish Date - 2022-09-13T06:05:54+05:30 IST

తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు పుస్తకం విషయంలో ఒకరినొకరు నెట్టుకోగా ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో విద్యార్థి కంటికి పెన్సిల్‌ గుచ్చుకుని గాయపడ్డాడు.

విద్యార్థి కంట్లో గుచ్చుకున్న పెన్సిల్‌

 పుస్తకంకోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గలాటలో మరో విద్యార్థికి గాయం 

మెరుగైన చికిత్సకోసం హైదారాబాద్‌ తరలింపు

బూర్గంపాడు, సెప్టెంబరు 12: తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు పుస్తకం విషయంలో ఒకరినొకరు నెట్టుకోగా ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో విద్యార్థి కంటికి పెన్సిల్‌ గుచ్చుకుని గాయపడ్డాడు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బూర్గంపాడులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలో పుస్తకం గుంజుకుంటున్న క్రమంలో పక్కనే ఉన్న మరో విద్యార్థి రాకేష్‌ కంటికి ప్రమాదపుశాత్తు ఓ విద్యార్థి చేతిలోని పెన్సిల్‌ గుచ్చుకుంది. దీంతో ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు దేవ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో గాయపడ్డ విద్యార్థిని తోటి విద్యార్థిచేత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పరిశీలించిన వైద్యులు భద్రాచలం తీసుకవెళ్లాలని సూచించారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన విద్యార్థులు వెనుదిరిగి పాఠశాలకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ సిరిపురపు స్వప్న, పలువురు యువకులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడుతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. గాయపడ్డ విద్యార్థి రాకేష్‌ను వార్డెన్‌ సతీష్‌ ముందుగా భద్రాచలం తరలించారు. అనంతరం పాల్వంచలోని ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించడంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారు. 


ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్‌పై స్థానికుల మండిపాటు


ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో వార్డెన్‌ అందుబాటులో లేరు. అంతేకాక గాయమైన విద్యార్థిని తోటి విద్యార్థితో ఆసుపత్రికి పంపిచడం పట్ల పలు విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న బాధిత విద్యార్ధిని భద్రాచలం తరలించకుండా గంటకుపైగా పాఠశాలలోనే ఉంచారని మండపడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన తమపై మండిపడుతూ పాఠశాల నుంచి బయటకు వెళ్లాలని గేట్లు వేశారని స్థానికులు ఆరోపించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎం, వార్డెన్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా  అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Read more