మళ్లీ తుది ప్రమాదహెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-17T05:38:53+05:30 IST

ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గత 24గంటలుగా గోదావరి క్రమేపీ పెరుగుతోంది. సోమవారం అర్ధరాత్రి 12గంటలకు 47.2అడుగులున్న గోదావరి నీటిమట్టం మంగళవా

మళ్లీ తుది ప్రమాదహెచ్చరిక

 భద్రాచలం వద్ద 53 అడుగులు దాటిన గోదావరి ప్రవాహం

ఏజెన్సీలో పలు రహదారులపై రాకపోకలకు అంతరాయం

భద్రాచలం, ఆగస్టు 16: ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గత 24గంటలుగా గోదావరి క్రమేపీ పెరుగుతోంది. సోమవారం అర్ధరాత్రి 12గంటలకు 47.2అడుగులున్న గోదావరి నీటిమట్టం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు 48అడుగులకు చేరడంతో భద్రాచలం సబ్‌కలెక్టరు వెంకటేశ్వర్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు 50.3 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో తుది ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరికొంత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు తెలిపారు. గోదావరి వరదల కారణంగా భద్రాచలం ఏజెన్సీలో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. భద్రాద్రి దేవస్థానం కల్యాణ కట్ట కిందిభాగం పూర్తిగా నీట మునిగింది. పర్ణశాలలో నారచీరల ప్రాంతం కూడా నీట మునిగి ఉంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి చర్ల, కూనవరం, కుక్కునూరు వైపు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు.  

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

- భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌

గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద 55అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంద న్నారు. దీంతో ముంపు మండలాల ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో పశువులను మేతకు బయటకు వదలవద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ సూచించారు. 

Updated Date - 2022-08-17T05:38:53+05:30 IST