100/100

ABN , First Publish Date - 2022-12-10T00:52:17+05:30 IST

భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల్లో ఈసారి అత్యధిక 10 జీపీఏ లక్ష్యంగా ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

100/100

వంద రోజుల్లో 100మార్కుల ప్రణాళిక

పదో తరగతి విద్యార్థులపై ఐటీడీఏ ప్రత్యేక నజర్‌

10 జీపీఏ లక్ష్యంగా అడుగులు

ప్రత్యేక కార్యాచరణతో తరగతులు

భద్రాచలం, డిసెంబరు 9: భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల్లో ఈసారి అత్యధిక 10 జీపీఏ లక్ష్యంగా ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఏటా పదో తరగతి ఫలితాలు నూరు శాతం లక్ష్యంగా ఆశ్రమాలు, వసతి గృహాలపై దృష్టిసారించే వారు. అయితే గత విద్యా సంవత్సరంలో 83 శాతం ఫలితాలు సాధించినా ఒక్క జీపీఏ కూడా విద్యార్ద్థులు సాధించలేదు. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ఎలాగైనా ఎక్కువ మంది విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్ది 10 జీపీఏ లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఐటీడీఏ పరిధలోని ప్రాజెక్టు మానిటరింగ్‌ అండ్‌ రిసోర్సు సెల్‌(పీఎంఆర్‌సీ) సిబ్బందికి ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు మార్గ నిర్దేశం చేశారు. ఐటీడీఏ పరిధిలో 39 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 16 వసతి గృహాల నుంచి 2,550 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను ఈసారి రాయనున్నారు. వీరందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద రోజుల ప్రణాళికను రూపొందించారు.

వంద రోజుల కార్యాచరణ

పదో తరగతి పరీక్షలకు ముందు వంద రోజుల కార్యాచరణను ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో అమలు చేయనున్నారు. ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహి ంచిన అనంతరం సంక్రాంతి సెలవుల అనంతరం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు విద్యార్థులను సన్నద్ధం చేయడంతో పాటు స్లిప్‌ టెస్టులను నిర్వహిస్తారు. మోడల్‌ గ్రాండ్‌ టెస్టు ఫిబ్రవరి చివరిలో నిర్వహించనుండగా మార్చి మొదటి వారం నుంచి షెడ్యుల్‌ ప్రకారం ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

పది జీపీఏ లక్ష్యంగా

అన్ని ఆశ్రమ పాఠశాలల్లో నూరు శాతం పలితాలే లక్ష్యంగా ముందుకు సాగనున్నప్పటికీ అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు అత్యధికంగా 10 జీపీఏ సాధించేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందు కోసం పీఎంఆర్‌సీలోని రిసోర్సు పర్సన్ల బృందం తరచూ విద్యా సంస్థలను సందర్శించడం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి నుంచి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ఐటీడీఏ పరిధిలోని 20 మంది అధికారులు దత్తత తీసుకోనున్నారు.

Updated Date - 2022-12-10T00:52:18+05:30 IST