ఫామ్ హౌస్ వేదికగా పూర్తైన కసరత్తు.. దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన?

ABN , First Publish Date - 2022-09-28T20:05:03+05:30 IST

దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త జాతీయ పార్టీ (National Party) ప్రకటన ఉండనుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినవస్తున్నాయి.

ఫామ్ హౌస్ వేదికగా పూర్తైన కసరత్తు.. దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన?

హైదరాబాద్ : దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త జాతీయ పార్టీ (National Party) ప్రకటన ఉండనుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినవస్తున్నాయి. దీని కోసం ఫామ్ హౌస్ (Farm House) వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దసరా రోజునే టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) సమావేశం జరగనుందని సమాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే పార్టీ జెండా - ఎజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారని సమాచారం. 


ఇక పార్టీకి సంబంధించిన జెండా రూపకల్పన విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం కేసీఆర్ జాతీయ పార్టీ జెండాలో మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీ ఎజెండా విషయానికి వస్తే... రైతులు, దళితులు, యువతను టార్గెట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేస్తూ కేసీఆర్ తమ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్టు సమాచారం. ఇక పార్టీ పేరు.. ‘భారత రాష్ట్ర సమితి’ అని టాక్ నడుస్తోంది కానీ క్లారిటీగా ఇదే అన్న విషయం మాత్రం తెలియడం లేదు. మొత్తానికి దసరాతో సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.

Read more