పార్టీలనే మింగిన ఘనుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-18T08:56:52+05:30 IST

చట్టాన్ని చట్టుబండలు చేసి పార్టీలనే మింగిన ఘనుడు సీఎం కేసీఆర్‌ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు.

పార్టీలనే మింగిన ఘనుడు కేసీఆర్‌

  • ఎన్నికలకు రూ.10వేల కోట్లు సిద్ధం చేశారు
  • కేసీఆర్‌ పాలనను బొందపెట్టడమే బీజేపీ లక్ష్యం: ఈటల
  • ప్రతి నియోజకవర్గానికి ఓ బుల్డోజర్‌ రెడీ: రాజాసింగ్‌ 
  • భట్టి విక్రమార్కను లోక్‌సభకు పంపాలన్న 
  • కేసీఆర్‌ మాటల వెనుక ఆంతర్యమేంటి?: రఘునందన్‌


హైదరాబాద్‌, కవాడిగూడ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): చట్టాన్ని చట్టుబండలు చేసి పార్టీలనే మింగిన ఘనుడు సీఎం కేసీఆర్‌ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు. ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా, దాన్ని చట్టుబండలు చేసి 2014లో టీడీపీని మింగిండ్రు.. 2018లో కాంగ్రెస్‌ను మింగిండ్రు.. ఎంఐఎం ఉందని, కాంగ్రెసోళ్లు వస్తరని నమ్ముకుని ఎన్నికల్లో 30 సీట్లు వచ్చినా సీఎం కావొచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నడు.. కానీ, అది సాధ్యం కాదు.. ఎందుకంటే.. నిలబడి.. కలబడి.. కొట్లాడే బీజేపీ ఇక్కడుం ది. ఢిల్లీలో ఏదైనా పైరవీ చేస్తే బీజేపీ కలిసి రాకపోతుందా! అని కేసీఆర్‌ అనుకుంటున్నరు.. బీజేపీతో మిత్రత్వం అన్నది ముగిసిన కథ.. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’ అని ఈటల స్పష్టం చేశారు. తమ సభ్యులను శాసన సభ నుంచి సస్పెండ్‌ చేసినందుకు నిరసనగా బీజేపీ గురువారం ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష నిర్వహించింది. 


ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘ప్రజా విశ్వాసం కోల్పోయి, డబ్బునే నమ్ముకున్న కేసీఆర్‌కు పీకే అవసరం పడ్డది.. ఆయన బెంగాల్‌లో ఏం చేసిండు? కాలు విరక్కముందే (మమతకు) పట్టేసిండు.. ఇక్కడ కూడా మొన్న కేసీఆర్‌ను హాస్పిటల్‌కు తీసుకుపోయిండు.. రూ.600 కోట్లు ఖర్చు చేసినా రూ.4వేల కోట్ల జీవోలు ఇచ్చినా హుజురాబాద్‌లో మట్టి కరిపించిండ్రు.. ఒక హుజూరాబాద్‌ ఒ క తెలంగాణ అవుతుంది.. దీన్ని ఆపగలిగే శక్తి మీ జేజమ్మకు కూడా లేదు’ అని ఈటల అన్నా రు. పీకేలు, గీకేలు ఇక్కడ నడువవని, తెలంగాణ ఆత్మగౌరవం, చైతన్యం మా త్రమే నడుస్తదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ బేవకూఫ్‌ సీఎం అని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతల అవినీతి పాలనను కూల్చి వేసేందుకు నియోజకవర్గానికో బుల్డోజర్‌ సిద్ధమవుతోందని, అమిత్‌షా ఇప్పటికే బండి సంజయ్‌కి ఒక బుల్డోజర్‌ గిఫ్టుగా ఇచ్చారని అన్నారు. టీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌ ఒకటే అని రఘునందన్‌రావు ఆరోపించారు. మల్లు భట్టి విక్రమార్కను లోక్‌సభకు పంపాలని కేసీఆర్‌ అనడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ మహిళా గవర్నర్‌ ను అవమానించిన కేసీఆర్‌కు, మహిళా బంధు ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదన్నారు. ఎంపీ సోయం బాపురావు, లక్ష్మణ్‌, స్వామి గౌడ్‌, ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, రవీంద్రనాయక్‌, వివేక్‌ , ఇంద్రసేనారెడ్డి, విజయరామారావు. బాబూ మోహన్‌, ధర్మారావు, యెండల, బోడిగె శోభ హాజరయ్యారు. 


దీక్షకు విశేష స్పందన 

 ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు విశేష స్పందన లభించింది. నగరం నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరావడంతో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ పూర్తిగా కాషాయమయమైంది. 

Read more