‘ఎట్‌ హోం’కు కేసీఆర్‌ డుమ్మా

ABN , First Publish Date - 2022-08-16T07:58:26+05:30 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విభేదాల తీవ్రత మరోసారి బహిర్గతమైంది.

‘ఎట్‌ హోం’కు కేసీఆర్‌ డుమ్మా

గవర్నర్‌ తేనీటి విందుకు హాజరుకాని సీఎం

మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు కూడా..

సీఎం, రాజ్‌భవన్‌ మధ్య మరింత దూరం

హైకోర్టు సీజేకు, సీఎంకు ఆహ్వానం పంపా

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడి

బీజేపీ నేతల హాజరు, కనిపించని కాంగ్రెస్‌


హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విభేదాల తీవ్రత మరోసారి బహిర్గతమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఏర్పాటు చేసిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యారు. తొలుత ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని, సాయంత్రం 6.55 గంటలకు వస్తారని ప్రగతి భవన్‌ నుంచి రాజ్‌భవన్‌ అధికారులకు సమాచారం అందింది. కానీ, చివరి నిమిషంలో కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా.. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రభుత్వం తరఫున సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాత్రమే ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. అదికూడా కార్యక్రమం ప్రారంభానికి కొద్దిసమయం ముందు వచ్చి.. ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, మహేశ్‌ భగవత్‌తోపాటు అతికొద్ది మంది అధికారులు ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. స్వాతంత్ర సమరయోధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వీరితోపాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ ‘ఎట్‌ హోం’ కార్యక్రమంలో కనిపించలేదు. హాజరైన ప్రతి ఒక్కరినీ గవర్నర్‌ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. కాగా, ఎట్‌ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ఎందుకు హాజరుకాలేదో తమకు సమాచారం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 6.55 నిమిషాలకు సీఎం వస్తారని తొలుత తమకు సమాచారం అందిందని, దీంతో చివరి నిమిషం వరకు తాను, హైకోర్టు సీజే ఎదురు చూశామని తెలిపారు. ఈ నిరీక్షణ వల్ల కార్యక్రమాన్ని కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. 


పెరుగుతూ వస్తున్న దూరం..

సీఎం కేసీఆర్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య గత రెండేళ్లుగా దూరం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. గవర్నర్‌ తమిళిసై రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం ప్రొటోకాల్‌ కల్పించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేశారు. గవర్నర్‌ తల్లి చనిపోయినా సీఎం కేసీఆర్‌ పరామర్శించలేదు. ప్రొటోకాల్‌ విషయంలో గవర్నర్‌ పలుమార్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఢిల్లీ కేంద్రంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దర్బార్‌, వరద ముంపు ప్రాంతాల సందర్శన, బాసర ట్రిపుల్‌ ఐటీ సందర్శన, విద్యార్థులతో సమావేశం.. పలు కార్యక్రమాలను గవర్నర్‌ చేపడుతున్నారు. ముందస్తు ఎన్నికల విషయంలోనూ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేళ్లుగా రాజ్‌భవన్‌-ప్రగతి భవన్‌ మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్‌భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమాలకు సీఎంతోపాటు, టీఆర్‌ఎస్‌ నేతలు దూరంగా ఉంటున్నారు. ఇంతకుముందు చివరిగా ఎట్‌ హోం కార్యక్రమాన్ని 2020 జనవరి 26న నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా జరగలేదు. రెండేళ్ల తరువాత జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండడంతో దూరం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


రాజ్‌భవన్‌లో మీ స్నేహితురాలు  ఉందనుకోండి: గవర్నర్‌

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఎంపికైన 75 మంది విద్యార్థులకు రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ తమిళిసై అవార్డులు, ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ... నేటి విద్యార్థులు భవిష్యత్‌ తెలంగాణకు పిల్లర్లు అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతీయులకు పిన్ను తయారు చేసుకోవడం రాదని బ్రిటి్‌షవారు అన్నారని, కానీ.. స్వతంత్ర భారతంలో అంతరిక్షంలోకి ప్రయాణం చేశామని గవర్నర్‌ తెలిపారు. ‘‘మీకు ఏదైనా సమస్య వేస్త రాజ్‌భవన్‌లో గవర్నర్‌కాదు.. మీ ేస్నహితురాలు ఉందనుకోండి’’ అని విద్యార్థులతో గవర్నర్‌ అన్నారు. ఉత్తమ వ్యాసాలుగా ఎంపికైన 75 వ్యాసాలతో ప్రత్యేకంగా పుస్తకం ముద్రిస్తున్నామని తెలిపారు. 

Read more