CM KCR: యాదాద్రి ఆలయ గోపురానికి కిలో 16 తులాల బంగారం విరాళమిచ్చిన కేసీఆర్

ABN , First Publish Date - 2022-10-01T01:38:10+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు కుటుంబసమేతంగా వచ్చిన

CM KCR: యాదాద్రి ఆలయ గోపురానికి కిలో 16 తులాల బంగారం విరాళమిచ్చిన కేసీఆర్

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు కుటుంబసమేతంగా వచ్చిన కేసీఆర్‌కు వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికింది. ప్రధానాలయ తూర్పు ఈశాన్య త్రితల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోనికి ప్రవేశించిన కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ ముఖమండపంలో ధ్వజస్థంభం, బలిపీఠాలకు మొక్కుకుని గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకున్నారు. స్వయంభువులు, కవచమూర్తులను దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పండ్లతోపాటు విమానగోపురం బంగారు తాపడంకోసం కిలో 16తులాల బంగారానికి అవసరమైన రూ.52,48,097 విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు. కాగా విమానగోపురం బంగారు తాపడానికి విరాళం చెక్కును సీఎం మనమడు హిమాన్షు దేవస్థాన ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకబృందం సీఎం దంపతులకు చతుర్వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీత సీఎం సతీమణి శోభకు పట్టువస్త్రాలు, అభిషేకం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 


పలువురు విరాళాల అందజేత

లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మొత్తం రూ.2,03,67,721 విరాళాలు అందజేశారు. ముఖ్యమంత్రి తన కుటుంబం తరపున కిలో 16తులాల బంగారానికి రూ.52,48,097లను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ఎ.రజిత రూ.30,15000, స్నేహిత బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున 51,00,624, ఏనుగు దయానంద్‌రెడ్డి రూ.50,04,000, పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి రూ.20లక్షల విరాళాలు అందజేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన తల్లిదండ్రులు, ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డి, కుమార్తెలు అనౌశికరెడ్డి, అనన్యరెడ్డి, సోదరుడు  రాజేశ్వర్‌రెడ్డి రేవతి దంపతులు, సోదరి కరుణ శ్రీనివా్‌సరెడ్డి దంపతులు, వెంకట్‌రాజన్న, రాజుభాయ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T01:38:10+05:30 IST