కరెంట్‌ చార్జీల పెంపునకు కేసీఆర్‌ కుట్ర

ABN , First Publish Date - 2022-08-21T07:46:44+05:30 IST

విద్యుత్‌ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సాకుగా చూపుతూ..

కరెంట్‌ చార్జీల పెంపునకు కేసీఆర్‌ కుట్ర

మరో రూ.4 వేల కోట్లు రాబట్టుకునే యత్నం

బకాయిలు కట్టకుండా కేంద్రంపై విమర్శలా?

ఉచిత విద్యుత్‌ను నిలిపివేసి కేంద్రంపై తోసే చర్య 

కేసీఆర్‌ హామీలు బోగస్‌..

ఒక్కటి నెరవేర్చినా నా తల నరుక్కుంటా

బండి సంజయ్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జనగామ, రఘునాథపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సాకుగా చూపుతూ.. వచ్చే నెలలో రాష్ట్రంలో మరోసారి కరెంట్‌ చార్జీలు పెంచేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా కేంద్రంపై, మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌, ఆశ్వరావుపల్లిలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి డిస్కమ్‌లకు రూ.17 వేల కోట్ల బకాయిలున్నాయని, ఒక్క పాతబస్తీలోనే ఏడాదికి రూ.1000 కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయని, ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. పాతబస్తీలో బకాయిలను వసూలు చేయడానికి ధైర్యం లేదని, గజ్వేల్‌ నియోజకవర్గంలో కంపెనీల బకాయిలను వసూలు చేయడం లేదని విమర్శించారు. డిస్కమ్‌లకు బకాయి పడడంతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడుతుందని, తద్వారా ఉచిత విద్యుత్‌ను నిలిపివేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని విమర్శించారు. ఆ నేరాన్ని కేంద్రంపై నెట్టి వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కరెంట్‌ చార్జీలు పెంచడం కోసమే ఈ విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిట్ట కథలు చెప్పి ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌ నైజమని అన్నారు. వచ్చే నెలలో మళ్లీ విద్యుత్తు చార్జీలు పెంచి మరో రూ.4వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 


ఉచిత విద్యుత్‌కు కేంద్రం వ్యతిరేకం కాదు

ఉచిత విద్యుత్‌కు, ఉచిత పథకాలకు ప్రధాని మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వ్యతిరేకం కాదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఉచిత పథకాల పేరుతో ప్రజలకు భారం వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్‌ డిస్కమ్‌లకు ఎందుకు బకాయిలు పెడుతున్నారని ప్రశ్నించారు. పవర్‌ ఎక్స్ఛేంజ్‌ల వద్ద విద్యుత్‌ కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. కేవలం తెలంగాణే కాకుండా తమిళనాడు, జమ్మూకశ్మీర్‌, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్‌, బిహార్‌, మణిపూర్‌, మిజోరాం రాష్ట్రాలపైనా నిషేధం విధించిందన్నారు. ఇందులో కొన్ని రాష్ట్రాలు బకాయిలు కట్టి నిషేదిక జాబితా నుంచి తొలగించుకున్నాయన్నారు. విద్యుత్‌ బకాయిల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని బండి సంజయ్‌ విమర్శించారు. బకాయిలు చెల్లించకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు, దేశంలోని డిస్కమ్‌లలో తెలంగాణ ర్యాంకింగ్‌ ఎంత?, జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా గెలిచేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. హర్‌ ఘర్‌ జల్‌ పేరిట జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రవేశపెట్టి, గోవాలో 100 శాతం ఇళ్లకు నీరిస్తున్నారని ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌కు ఎక్కడా లేని కోపం పుట్టుకొచ్చిందని, ఉన్న మాట చెబితే ఎలుకెందుకని బండి సంజయ్‌ నేడొక ప్రకటనలో ప్రశ్నించారు. గాలి మాటలు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి ఎవరూ సాటిరారన్నారు. 


నేటి యాత్ర వాయిదా 

మునుగోడులో ఆదివారం సమరభేరి సభ నేపథ్యంలో సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను వాయిదా వేశారు. తిరిగి సోమవారం నుంచి యాత్ర యథావిధిగా కొనసాగనుంది. శనివారం రాత్రి మీదికొండలో బస చేసిన  సంజయ్‌ ఆదివారం ఉదయం అక్కడి నుంచే మునుగోడుకు బయలు దేరనున్నారు. 


కేసీఆర్‌లో ఓటమి భయం కనిపించింది: లక్ష్మణ్‌

మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌ బాధ్యతారహితంగా మాట్లాడారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రిపై ఆయన చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందన్న భావన కేసీఆర్‌లో కలిగిందని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయనలో ఓటమి భయం కనిపించిందన్నారు. రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్‌ ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతారని రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంలో కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. ఆసరా పెన్షన్ల విషయంలో అమిత్‌ షా అనని విషయాలను ఆయనకు ఆపాదించడం సీఎంకు తగదన్నారు.

Updated Date - 2022-08-21T07:46:44+05:30 IST