బీజేపీ దేశాన్ని కబళిస్తోంది

ABN , First Publish Date - 2022-10-03T10:03:44+05:30 IST

భారతదేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్‌ గాంధీనే అని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తాజా పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో బోయినపల్లి మహాత్మగాంధీ

బీజేపీ దేశాన్ని కబళిస్తోంది

దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్‌

కేసీఆర్‌, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు: రేవంత్‌రెడ్డి


బోయినపల్లి, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): భారతదేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్‌ గాంధీనే అని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తాజా పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో బోయినపల్లి మహాత్మగాంధీ ఐడియాలజీ శిక్షణ కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ వలన దేశం అభివృద్ధిపథంలో పయనించిందని, ఇప్పుడు కొత్తగా బీజేపీ అనే విషవృక్షం దేశాన్ని కబళిస్తోందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ, ఇద్దరూ బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యుల్లా తయారయ్యారు. ఆంగ్లేయుల చెరనుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించడానికి గాంధీ ఎంతో కృషి చేశారు.


దండియాత్ర, క్విట్‌ ఇండియా ఉద్యమంలో ‘డూ ఆర్‌ డై’ నినాదంతో దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించారు. గాంధీ స్ఫూర్తితోనే నెహ్రూ హరిత విప్లవం తీసుకొచ్చారు. దేశంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోంది. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, బ్రిటిషర్లు అనుసరించిన విభజించు, పాలించు అనే విధానాన్ని అటు మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకురావాలి.


బీజేపీని ఎదుర్కొనేందుకే రాహుల్‌ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు. రాహుల్‌ గాంధీకి తెలంగాణ సంపూర్ణంగా అండగా నిలవాలి. ప్రజలందరూ ఈ యాత్రలో పాలుపంచుకుని విజయవంతం చేయాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, వి. హన్మంత్‌రావు, చిన్నారెడ్డి తదితరులు, పాల్గొన్నారు. 


గాంధీభవన్‌లో..

ఆదివారం గాంధీభవన్‌లో గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు ఘన నివాళి అర్పించారు. దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతినీ పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికీ నివాళిని అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మహే్‌షకుమార్‌ గౌడ్‌, రోహిత్‌ చౌదరి, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.  గాంధీభవన్‌ ట్రస్టు ఆధ్వర్యంలోనూ గాంధీజీకి ట్రస్టు సభ్యులు ఘన నివాళులర్పించారు.


సురేందర్‌రెడ్డికి రాజీవ్‌ సద్భావనా అవార్డు

ఈ నెల 19న చార్మినార్‌ వద్ద నిర్వహించే రాజీవ్‌సద్భావనా యాత్రలో మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డికి రాజీవ్‌సద్భావనా అవార్డును ప్రదానం చేయనున్నట్లు సద్భావనా యాత్ర కమిటీ చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. 


అసెంబ్లీ ప్రాంగణంలో..

అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీజయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని, సమానంగా పరిపాలన చేరువకావాలన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ..దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుని అవసరం ఉందని, ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T10:03:44+05:30 IST