BANDI SANJAY: కవితపై సమగ్ర విచారణే

ABN , First Publish Date - 2022-12-12T03:28:35+05:30 IST

లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడడంతో పాటు క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన సీఎం కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు... ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆమె ఇంటిని చూసి ఆశ్చర్యపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

BANDI SANJAY: కవితపై సమగ్ర విచారణే

ఇంద్ర భవనంలాంటి కవిత ఇంటిని చూసి

ఆశ్చర్యపోయిన సీబీఐ అధికారులు

దేశంలో అత్యంత ఆస్తిపరుడైన నేత కేసీఆర్‌

మోదీ పేరు చెప్పి మోటార్లకు మీటర్లు

పెడితే సీఎంను బజారుకీడుస్తాం: బండి

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడడంతో పాటు క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన సీఎం కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు... ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆమె ఇంటిని చూసి ఆశ్చర్యపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కవిత నివాసానికి సీబీఐ అధికారులు టీ తాగడానికి, బిస్కట్లు తినడానికి వెళ్లలేదని, సమగ్ర విచారణ జరుపుతారని చెప్పారు. దేశంలోనే అత్యంత ఆస్తిపరులైన నేతల్లో సీఎం కేసీఆర్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తాడని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 14వ రోజు ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మోహన్‌రావుపేటలో రచ్చబండ నిర్వహించి ప్రజలతో ముచ్చటించారు. నూతన వధూవరులు పూదరి హిమజ-శరత్‌లు వచ్చి సంజయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్‌ జెఎన్‌ వెంకట్‌ సునీత, వెంకట్‌ దంపతులు సంజయ్‌కు బెల్లంతో తులాభారం నిర్వహించారు. గల్ఫ్‌ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రచ్చబండతో పాటు ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌ షోలలో సంజయ్‌ మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో నోటిఫికేషన్లే తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా సీఎం కేసీఆర్‌ భర్తీ చేయలేదని విమర్శించారు.

యువత ఉద్యోగాలు, ఉపాధి లేక గల్ఫ్‌కు వలస వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్‌, తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు చెప్పి తెలంగాణలో మోటార్లుకు మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తే కేసీఆర్‌ను బజారుకు లాక్కొస్తామన్నారు. పేదల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తనను ఆరు ముక్కలు చేస్తానని కేసీఆర్‌ అంటున్నాడని, తాను చావడానికి రెడీ అని, కానీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజన బంధు సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం అమలు చేయాలన్నారు. కేసీఆర్‌ ఎన్ని పైసలు పంచినా దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

గల్ఫ్‌ బాధితుల సమస్యలు తీరలేదు

కేసీఆర్‌ పాలనలో గల్ఫ్‌ బాధితుల సమస్యలు తీరలేదని సంజయ్‌ ధ్వజమెత్తారు. పేదలు పొట్టకూటి కోసం దుబాయి వెళ్తున్నారని, ఏజంట్ల చేతిలో మోసపోయి నానా అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దుబాయి వెళ్లిన వలస కార్మికులు సైతం కేసీఆర్‌కు విరాళాలు ఇచ్చారన్నారు. అలాంటి వాళ్లను ఇష్టమొచ్చిన రీతిలో తిట్టిన వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. దుబాయి నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా తానే సుమారు 500 వరకు మృతదేహాలను స్వగ్రామాలకు తెప్పించడానికి సాయం చేశానని తెలిపారు. గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న బాధితులను తీసుకువస్తామని చెప్పారు.

Updated Date - 2022-12-12T03:28:36+05:30 IST