యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-11-28T00:44:06+05:30 IST

యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకపోతే అసెంబ్లీని ముట్టిడిస్తామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

సుభాష్‌నగర్‌, నవంబరు 27: యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకపోతే అసెంబ్లీని ముట్టిడిస్తామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల ఆలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనకబడిపోయారని అన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ హయాంలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్‌ కమిటీ యాదవుల స్థితిగతులపై అధ్యయనం చేసిందన్నారు. వారి అధ్యయనంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర యాదవులు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా యాదవులకు నెహ్రూ 10 శాతం ఎస్‌ఎన్‌టీ (అర్ధ సంచార జాతులు) రిజర్వేషన్లు కల్పించారన్నారు. దాని ద్వారా యాదవులకు విద్య, ఉద్యోగాలు లభించాయన్నారు. 1970లో ఆ రిజర్వేషన్లను తొలగించారని, వెంటనే ఆ రిజర్వేషన్లను పురుద్ధరించాలని కోరారు. డిసెంబరులో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు యాదవ కార్పొరేషన్‌పై ప్రకటన చేయాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. చనిపోయిన గొర్లు, మేకల పెంపకందారులకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యాదవులకు నెలకు ఐదు వేల రూపాయల ఫించన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 20న కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని, ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తమ ఆకాంక్షను తెలియచేస్తామన్నారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బండి మల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్‌, వాసం మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగ కొమురయ్య, పెగడ రమేశ్‌, చేర్ల పద్మ, ఆదిశెట్టి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:44:18+05:30 IST