‘మన ఊరు-మనబడి’ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T00:25:34+05:30 IST

నాగంపేట జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌లో చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ అభివృద్ధి పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

‘మన ఊరు-మనబడి’ పనులు పూర్తి చేయాలి
నాగంపేట పాఠశాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

గంభీరావుపేట, నవంబరు 29: నాగంపేట జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌లో చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ అభివృద్ధి పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. ‘మన ఊరు-మనబడి’ కింద గంభీరావుపేట మండలం నాగంపేటలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.15 లక్షలతోనూ, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.5.5 లక్షలతోనూ చేపట్టిన పనులను మంగళవారం తనిఖీ చేశారు. జడ్పీహెచ్‌ఎస్‌కు పెయింటింగ్‌ వేయించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న టాయిలెట్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. లైబ్రెరీలో ఉన్న పుస్తకాల గురించి తెలుసుకున్నారు. జిల్లాలోని 100కి పైగా విద్యార్థులు సంఖ్య ఉన్న హై స్కూల్‌లలో మంచి లైబ్రెరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఈవోకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో 115 మంది విద్యార్థులు ఉన్నారని సరిపడా ఉపాధ్యాయులు లేక పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పైవ్రేటు పాఠశాలలకు పంపుతున్నారని గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఎంపీపీఎస్‌కు ఒక ప్రభుత్వ టీచర్‌ను పంపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. డీఈవో రాధాకిషన్‌, టీఎస్‌ఈడబ్ల్యూడీసీ ఈఈ విరూపాక్ష, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-11-30T00:25:34+05:30 IST

Read more