డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-10-13T04:41:42+05:30 IST

జమ్మికుంట, అక్టోబరు 12: జమ్మికుంటలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని నిరుపేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఎప్పుడు?
ధర్మారంలో పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు

- జమ్మికుంటలో నాలుగేళ్లలో రెండుసార్లు దరఖాస్తుల స్వీకరణ

- మూడు నెలలు సాగిన సర్వే.. అటకెక్కిన లాటరీ విధానం

జమ్మికుంట, అక్టోబరు 12:  జమ్మికుంట, అక్టోబరు 12: జమ్మికుంటలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని నిరుపేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లలో రెండు సార్లు దరఖాస్తులు స్వీకరించినా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  తొమ్మిది నెలల క్రితం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేసింది. దరఖాస్తుల స్వీకరణ, సర్వేల పేరుతో హడావుడి చేసింది. మళ్లీ ఏమైందో తెలియదు కాని వాయిదా పడింది. దీంతో అధికారుల తీరుపై దరఖాస్తు దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


 జమ్మికుంటకు 500 ఇళ్లు మంజూరు..


జమ్మికుంట మున్సిపల్‌ పరిదిలో 500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మజూరు చేసింది. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నాలుగేళ్ల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. 20 బ్లాక్‌ల  నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కాగా, మరో మూడు బ్లాకుల్లో  పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో బ్లాక్‌కు 12 చొప్పున 240 ఇళ్లు ఉన్నాయి. మారుతి నగర్‌లోని 9 బ్లాకుల్లో 108 ఇళ్ల పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ధర్మారం పరిధిలో 152 ఇళ్లు పూర్తయ్యాయి. 

 

4,468 దరఖాస్తులు


మున్సిపల్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పంపిణీ చేస్తామని ఈ ఏడాది జనవరిలో అధికారులు ప్రకటించారు. జనవరి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో గడువు తేదీని 15 వరకు పెంచారు. మొత్తం 4,468 దరఖాస్తులు వచ్చినట్లు రెవిన్యూ అధికారులు వెల్లడించారు. అర్హులను గుర్తించేందుకు రెవిన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి మూడు నెలలపాటు సర్వే నిర్వహించారు. వేలాదిగా దరఖాస్తులు రావడంతో పంపిణీ ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కాని ఇళ్ల పంపిణీ మూలన పడింది.  ఇప్పటికెనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. 


 ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ చేస్తాం: రాజేశ్వరి, తహసీల్దార్‌


జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కోసం ఈ ఏడాది జనవరిలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను జమ్మికుంట తహసీల్దార్‌గా లేను. సర్వే పూర్తి అయిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాను. వచ్చిన దరఖాస్తులను ఆర్డీవోకు అప్పగించాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పంపిణీ ప్రక్రియ మొదలు పెడుతాం. 

Read more