రాజీవ్‌ రహదారిపై నిరుద్యోగి అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-01-28T06:05:13+05:30 IST

తన తండ్రి మరణానంతరం రావాల్సిన సింగరేణి ఉద్యోగం రావడం లేదని ఓ నిరుద్యోగి గురువారం రాజీవ్‌ రహదారిపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శన చేశాడు.

రాజీవ్‌ రహదారిపై నిరుద్యోగి అర్ధనగ్న ప్రదర్శన
చీకురాయి క్రాస్‌ రోడ్డు వద్ద రాజీవ్‌ రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువకుడు

 - రెండేళ్లుగా సింగరేణి ఉద్యోగం కోసం ప్రదక్షిణలు

పెద్దపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి మరణానంతరం రావాల్సిన సింగరేణి ఉద్యోగం రావడం లేదని ఓ నిరుద్యోగి గురువారం రాజీవ్‌ రహదారిపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ఒర్రె సాయితేజ ఉన్నత చదువులు చదువుకున్నాడు. తన తండ్రి ఒర్రె పర్వతాలు సింగరేణిలో కార్మికుడిగా పని చేసే వారు. ఆయన 2014లో గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన స్థానంలో కుమారుడు సాయితేజకు ఉద్యోగం రావాల్సి ఉండగా, ఆ ఉద్యోగం కోసం రెండు సంవత్సరాలుగా ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక డబ్బులు ఖర్చు చేశాడు. కార్యాలయాల చుట్టూ ఎంతగా తిరిగినా ఉద్యోగం రాకపోవడంతో కొన్ని రోజులుగా సాయితేజ రాష్ట్ర ప్రభుత్వ తీరు, సింగరేణి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు. కల్వచర్ల నుంచి అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చిన సాయితేజ పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు మధ్యలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అప్పటికే సాయితేజ నడుచుకుంటూ పెద్దపల్లి వైపు వెళ్లారని అతడి తల్లి, బంధువులు, స్నేహితులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని అతడిని తీసుకెళ్లారు.

Read more