వీఆర్‌ఏల సమ్మెతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-09-30T04:53:29+05:30 IST

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లు అరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు.

వీఆర్‌ఏల సమ్మెతో ఇక్కట్లు
పెద్దపల్లిలో సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు(ఫైల్‌)

- ముందుకు సాగని రెవెన్యూ పనులు

- సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం

- ఇబ్బందులు పడుతున్న అధికారులు

- 67 రోజులుగా కొనసాగుతున్న సమ్మె

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లు అరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడి పనులు అక్కడే పెండింగులో ఉండిపోతున్నాయి. వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రెవెన్యూకు సంబంధించి క్షేత్రస్థాయిలో వీఆర్‌ఏలు మాత్రమే తగిన సమాచారం సేకరించి అధికారులకు ఇస్తారు. భూముల గురించి గానీ, ఇతరత్రా సరిఫికెట్ల జారీచేసేందుకు చేపట్టే విచారణకు వీఆర్‌ఏలు అందుబాటులో ఉంటేనే అధికారులకు సులువుగా ఉంటుంది. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు పేస్కేల్‌ వర్తింపజేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు 67 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపడం లేదు. దీని పర్యవసానంగా ఇటు అధికారులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు..

ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత మండల తహసీల్దార్‌, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఒక ధరణి ఆపరేటర్‌ భూముల రిజిస్ట్రేషన్ల పనిలో నిమగ్నం అవుతున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ కార్యాలయ పనులు చూస్తుండగా, మండల నాయబ్‌ తహసీల్దార్‌, రెవెన్యూ పరిశీలకులు క్షేత్రస్థాయిలో ఇతరత్రా పనులను చూస్తున్నారు. వివాదస్పద భూముల సమస్యలను పరిష్కరించాలంటే ఇరు వర్గాలకు, ఇతరులకు, భూములను సర్వే చేయాలన్నా ముందుగా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వీఆర్‌ఏలు చేస్తూ ఉంటారు. మరణ, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు కుటుంబ, ఆదాయం, నివాసం, కులం, నివేశన స్థలాలు, తదితర ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలంటే క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుంది. ఇలాంటి పనులను అధికారులు వీఆర్‌ఏలకే అప్పగిస్తూ ఉంటారు. ఇవేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో జీవో 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను పరిశీలించేందుకు వీఆర్‌ఏలు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వం రెగ్యులర్‌గా చేపట్టే ఆసరా పింఛన్ల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ, ఇతరత్రా పనులు చేపట్టేందుకు వీఆర్‌ఏలు అందుబాటులో లేకపోవడంతో ఆ భారం రెవెన్యూ అధికారుల మీదనే పడుతున్నది. క్షేత్రస్థాయిలో వివిధ సర్వేలు, విచారణలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌ రాకముందు గ్రామాల్లో వీఆర్‌వోలు ఉండేవారు. భూసమస్యలను పరిష్కరించేందుకు రైతులు, ఇతరుల నుంచి పెద్దఎత్తున లంచాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున రావడంతో ప్రభుత్వం రెవెన్యూ చట్టాలను సవరించి వీఆర్‌వోల వ్యవస్థను రద్దు చేసింది. ఏడాదిన్నర తర్వాత వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో గ్రామాల్లో రెవెన్యూ పనులతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను వీఆర్‌ఏలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీఆర్‌ఏలు సమ్మె చేస్తుండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్‌ఏలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని, పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

Read more