ముమ్మరంగా తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-30T05:09:37+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించి పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు అసుపత్రుల్లో ఏ మేరకు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారనే దానిపై వైద్యాధికారుల బృందాలు జల్లెడ పడుతున్నాయి.

ముమ్మరంగా తనిఖీలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో వివరాలు సేకరిస్తున్న అధికారులు

- జిల్లాలో 85 ప్రైవేట్‌ ఆసుపత్రుల తనిఖీ

- నిబంధనలు పాటించని వాటిపై చర్యలకు సిఫార్సులు 

- 19 ఆసుపత్రులకు నోటీసులు 

- క్షుణ్ణంగా పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించి పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు అసుపత్రుల్లో ఏ మేరకు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారనే దానిపై వైద్యాధికారుల బృందాలు జల్లెడ పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన చెక్‌ లిస్ట్‌ ప్రకారం తనిఖీలు చేస్తూ రిజిస్ట్రేషన్‌ లేని వాటికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. మౌలిక వసతులు లేకుండా, అనుమతులు లేకుండా ఉన్న ఆసుపత్రులపై చర్యలకు సిఫార్సులు చేయనున్నారు. జిల్లాలో తనిఖీలు చేసిన వైద్యాధికారుల బృందాలు ఏ రోజుకారోజు జిల్లా వైద్యా అరోగ్య అధికారికి నివేదికలు అందిస్తున్నారు. వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నారు. 

- 119 అసుపత్రులు, 5 బృందాలు..

జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లాలో 119 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా వీటిని తనిఖీ చేయడానికి వైద్యారోగ్య శాఖ ద్వారా ఐదు బృందాలను నియమించారు. జిల్లాలో ఇప్పటి వరకు 85 ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్‌ అనుమతులు లేని 19 అసుపత్రులకు నోటీసులను జారీ చేశారు. 

-  మౌలిక వసతులు కరువు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్న బృందాలకు ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతులు లేనివి కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ ప్రకారమే వైద్యులు ఉండాలి. శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఫైర్‌ సేఫ్టీతో పాటు ప్రతిరోజు వినియోగించే మందులు, ఇతర వస్తువులకు సంబంధించిన బయోలాజికల్‌ వేస్ట్‌కు సంబంధిచి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఉండాలి. రోగులు వేచిఉండడానికి రూమ్‌లతో పాటు, ఆసుపత్రిల్లో బోర్డులో పెట్టినట్లు స్పెషలిస్ట్‌ డాక్టర్లతోనే సేవలు అందించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి ఏర్పాట్లు ఉండాలి. జిల్లాలో స్పెషలిస్ట్‌ వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నా ఆ సేవలు అందడం లేదని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే సిజేరీయన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

- తనిఖీలు లేకనే ఉల్లంఘనలు.. 

వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు ప్రతీ మూడునెలలకు ఒకసారి వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తనిఖీలు లేకపోవడంతోనే నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ఇష్టానుసారంగా ల్యాబ్‌ల్లో రక్తపరీక్షలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ పొందిన సిబ్బంది లేకుండానే నర్సింగ్‌ హోంలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో ప్యాకేజీలకు అనుగుణంగానే వైద్యసేవలు అందిస్తూ ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య బృందం పరిశీలించిన విషయాలతో ప్రభుత్వానికి నివేదికలు అందించి జరిమానాలు, చర్యలు తీసుకోనున్నారు. 


Read more