దొంగలు బాబోయ్‌..

ABN , First Publish Date - 2022-11-21T00:43:09+05:30 IST

దొంగల భయంతో కోల్‌బెల్ట్‌ ప్రాంతం బెంబేలెత్తుతోంది. సింగరేణి కాలనీలు, కార్మిక కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు.

 దొంగలు బాబోయ్‌..
దొంగతనం జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీమ్‌(ఫైల్‌)

- సింగరేణి క్వార్టర్లలోనే వరుస ఘటనలు

- రెండు జిల్లాల్లో పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌

- క్లూస్‌ దొరకక సతమతం

కోల్‌సిటీ, నవంబరు 20: దొంగల భయంతో కోల్‌బెల్ట్‌ ప్రాంతం బెంబేలెత్తుతోంది. సింగరేణి కాలనీలు, కార్మిక కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. రెండునెలల నుంచి కార్మిక కుటుంబాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. సింగరేణి కాలరీస్‌ గనులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలోని కోల్‌బెల్టే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సింగరేణి క్వార్టర్లలో నివాసుముంటున్న కార్మిక కుటుంబాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. గత అక్టోబరు నుంచి ఇప్పటివరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని గోదావరిఖని, రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌, మందమర్రి ప్రాంతాల్లో 30వరకు చోరీలు జరిగాయి. ఇందులో 25వరకు సింగరేణి క్వార్టర్లలో జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కోల్‌బెల్ట్‌లో జరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. దొంగలు వ్యూహాత్మకంగా చోరీలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న కాలనీలు, వ్యాపార సంస్థలు ఉన్న ప్రాంతాలు కాకుండా ఇప్పుడు సింగరేణి కాలనీలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని, యైుటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌, మందమర్రి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. సింగరేణి కార్మికులు నివాసముంటున్న క్వార్టర్లే లక్ష్యంగా ఈ చోరీలు జరుగుతున్నాయి. సింగరేణి క్వార్టర్లలో రక్షణ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. క్వార్టర్లకు పటిష్టమైన తలుపులు లేవు. 25ఏళ్ల క్రితం వరకు టేకు దర్వాజలు, తలుపులు ఉండగా మెయింటనెన్స్‌లో ఆదా పేర ఏమాత్రం పటిష్టత లేని బైసన్‌ డోర్లకు క్వార్టర్లకు బిగిస్తున్నారు. దీంతో దొంగలు సింగరేణి క్వార్టర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రహారిలు దూకడం, తలుపులు సులువుగా విరిచి లోపలికి చొరబడుతున్నారు. లక్షల విలువైన సొత్తును ఎత్తుకుపోతున్నారు.

ఫ పోలీసుల ఇండ్లలోనూ..

కోల్‌బెల్ట్‌లో చోరీలకు పాల్పడుతున్న ముఠా చివరికి పోలీసుల ఇండ్లను కూడా వదలడం లేదు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ కుటుంబాలకు సింగరేణ క్వార్టర్లలో అద్దె ప్రాతిపదికన వసతి కల్పించారు. పోలీస్‌ కుటుంబాలు స్థానికంగా లేకుండా బయటకు వెళుతున్నప్పుడు విలువైన సొత్తును ఇంట్లో పెట్టిపోతున్నారు. రెక్కి చేస్తున్న దొంగలు ఇంట్లో ఉన్న సొత్తును ఎత్తుకుపోతున్నారు.

ఫ కాలనీల్లో నిఘా నేత్రాలేవి..

వేల కోట్ల టర్నోవర్‌, వందల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థ తమ కార్మికులు నివాసముంటున్న కాలనీల్లో ఒక్క సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం లేదు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో 30వేలకు పైగా సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. సింగరేణి కాలనీ మెయింటనెన్స్‌ నిధుల నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవకాశం ఉంది. హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు ఇచ్చిన సింగరేణి తమ కార్మిక కుటుంబాలు ఉన్న కాలనీల్లో మాత్రం ఒక్క కెమెరాను ఏర్పాటు చేయలేకపోతుంది.

ఫ లక్షల్లో సొమ్ము గల్లంతు..

కోల్‌బెల్ట్‌లోని గోదావరిఖని, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల్లో ఏ చోరీ జరిగినా లక్షల్లో సొమ్ము గల్లంతు అవుతోంది. గోదావరిఖనిలోని గాంధీనగర్‌, పవర్‌హౌస్‌కాలనీ, జీఎంకాలనీ, శారదానగర్‌ ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. గోదావరిఖని గాంధీనగర్‌లోని రాజయ్య అనే సింగరేణి కార్మికుడి కుటుంబం పెద్దపల్లి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక నుంచి లోపలికి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న 20తులాల బంగారు ఆభరణాలు, 40తులాల వెండి, నగదును ఎత్తుకెళ్లారు. గోదావరిఖని జీఎం కాలనీలోని ఒక ప్రైవేట్‌ చిట్టీ వ్యాపారి అదే కాలనీలో ఉండే తన షాపునకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోకి చొరబడిన దొంగలు పెద్దఎత్తున నగదును ఎత్తుకెళ్లారు. గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీలోని ఒక కార్మిక కుటుంబం ఇంటి ముందు పొరుగున ఉండే వారితో మాట్లాడుతుండగానే ఇంటి వెనుక నుంచి చొరబడిన దొంగలు నగదును ఎత్తుకెళ్లారు.

ఫ జాయింట్‌ ఆపరేషన్‌..

కోల్‌బెల్ట్‌లోని సింగరేణి కాలనీల్లో ఒకే తరహా దొంగతనాలు జరుగుతుండంతో కోల్‌బెల్ట్‌ ఠాణాల్లోని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీములతో జాయింట్‌ ఆపరేషన్‌ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ముగ్గురు నిందితులు పట్టుబడినా వారి వద్ద నుంచి ఆశించిన మేర సమాచారం రాలేదు. దీంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యులు గల ముఠా కోల్‌బెల్ట్‌లో చోరీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఏదేమైనా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

Updated Date - 2022-11-21T00:43:09+05:30 IST

Read more