దినసరి కార్మికుల వేతనం ఏడాదికి 10 శాతం పెంచాలి

ABN , First Publish Date - 2022-02-23T06:30:15+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో పనిచేసే దినసరి కార్మికులకు ప్రతి ఏడాది 10 శాతం చొప్పున వేతనాలు పెంచాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

దినసరి కార్మికుల వేతనం ఏడాదికి 10 శాతం పెంచాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో పనిచేసే దినసరి కార్మికులకు ప్రతి ఏడాది 10 శాతం చొప్పున వేతనాలు పెంచాలని కలెక్టర్‌  ఆర్వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దినసరి కార్మికుల వేతనాల పెంపుపై కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌, నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే అన్‌స్కిల్డ్‌ కార్మికులు, సెమీ స్కిల్డ్‌ కార్మికులు, స్కిల్డ్‌ కార్మికులకు (నాన్‌ మాస్టర్‌ రోల్‌) ప్రస్తుతం అందజేస్తున్న వేతనాలకు అందనంగా 15 శాతం పెంచి ఈ ఏడాది నుంచి ఇవ్వాలని జిల్లా కార్మికశాఖ అధికారులను ఆదేశించారు.  సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, మయాంక్‌ మిట్టల్‌, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌బాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కోటేశ్వర్లు, విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ జి కొమురయ్య, తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాశీరాం, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, చైల్డ్‌లైన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సంపత్‌, డీసీపీవో శాంత, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి నతానియేల్‌, పరిశ్రమలశాఖ జీఎం నవీన్‌ పాల్గొన్నారు. 

ఫ కష్టపడి పని చేయాలి

గణేశ్‌నగర్‌: కష్టపడి పని చేయాడాన్ని అలవాటు చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ యువతకు సూచించారు. మంగళవారం కరీంనగర్‌ ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబ్‌మేళాను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం అవసరమేనని అన్నారు. అది ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ ఉద్యోగమా అని కాకుండా ముందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. తాను డిగ్రీ అయిపోయాక ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ ఐఏఎస్‌కు ప్రిపేరై సాధించానని తెలిపారు. కరీంనగర్‌లోని వారధి సంస్థ ద్వారా కూడా జాబ్‌ మేళా నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె రామకృష్ణ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు 20 మల్టీ నేషనల్‌ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ స్కిల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, మల్టీ నేషనల్‌ కంపెనీల ప్రతినిధులు శేఖర్‌బాబు, లక్ష్మీనరసయ్య, వెంకటనరసయ్య, కళాశాలల ఎన్‌సీసీ అధికారి రాజు, అధికారులు పాల్గొన్నారు. Read more