గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-02-16T05:46:40+05:30 IST

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతను ఇస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

- ఘనంగా సేవలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలు 

సిరిసిల్ల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతను ఇస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని సినారె కళామందిరంలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలను నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. గిరిజన తండాల్లో విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు పాలన అవకాశాన్ని కల్పించారని అన్నారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, సివిల్‌ సర్వీస్‌ స్టడీ సర్కిల్‌ను స్పోర్ట్స్‌ కాలేజీలను ఏర్పాటు చేసి ఎస్టీ పిల్లలకు ఉన్నతస్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. గిరిజన పిల్లలకు గిరిపోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. జిల్లాలో మంత్రి కేటీఆర్‌ గిరిజన అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎంపీపీ బూల, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, సిరిసిల్ల తహసీల్దార్‌ విజయ్‌, కౌన్సిలర్లు రెడ్డినాయక్‌, శ్రీనివాస్‌, సేవాలాల్‌ జయంతి ఉత్సవ కమిటీ అద్యక్షుడు గుగులోతు సురేష్‌నాయక్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-16T05:46:40+05:30 IST