చేపల పెంపకం లక్ష్యం ఖరారు

ABN , First Publish Date - 2022-06-07T05:49:30+05:30 IST

జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యాన్ని మత్స్య శాఖ ఖరారు చేసింది.

చేపల పెంపకం లక్ష్యం ఖరారు

జిల్లాలో పంపిణీ కానున్న 1.58 కోట్ల చేప పిల్లలు

మందుస్తుగా దృష్టి సారించిన మత్సశాఖ

జిల్లాలో 11,622 మంది మత్స్యకారులకు చేకూరనున్న లబ్ధి

జగిత్యాల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యాన్ని మత్స్య శాఖ ఖరారు చేసింది. గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం సుమారు ఇరవై లక్ష లకు పైగా చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన చెరువుల్లో నిర్ణీత గడువు లోపు చేప పిల్లల్ని వదలాలని మత్స్య శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చేప పిల్లల సరఫరాకు అవసరమైన కాంట్రాక్టు టెండర్లను సైతం ఆహ్వానించింది.

జిల్లాలో మత్య శాఖ పరిస్థితి....

జిల్లాలో 441 గ్రామ పంచాయతీ చెరువులు, 181 డిపార్ట్‌మెంట్‌ చెరు వులున్నాయి. జిల్లాలోని 197 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 11,622 మంది సభ్యులున్నారు. ఇందులో 28 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 824 మంది మహిళా మత్స్య కార్మికులున్నారు. 169 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 10,798 మంది పురుష మత్స్య కారులున్నారు. జిల్లాలోని మత్స్య శాఖ పరిధిలో గల 180 చెరువులను మ త్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కౌలుకు ఇస్తున్నారు. దీని ద్వారా జిల్లాలో ప్రతీ యేటా రూ. 16.98 లక్షల కౌలు సొమ్ము వస్తోంది. జిల్లాలో ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌, గోదావరి నదిలో చేపలు పట్టుకోడానికి 2020-21 సంవత్సరానికి గాను 1,100 మందికి లైసెన్స్‌లు జారీ అయ్యాయి. ఇందుకు గాను లైసెన్స్‌ ఫీజు కింద రూ. 3.97 లక్షలు మత్స్య శాఖకు ఆదాయం ల భించింది. ప్రస్తుత 2022-23 యేడాది సైతం లైసెన్స్‌లు జారీ చేయడం, ఫీజులు కలెక్ట్‌ చేయడంపై మత్స్య శాఖ దృష్టి సారించింది.

జిల్లాలో ప్రస్తుతం 758 చెరువులు...

జిల్లాలో జియో ట్యాగింగ్‌ చేసిన ట్యాంకులు 758 వరకు ఉన్నాయి. మొ దటి నుంచి వివిధ కారణాలతో కొన్నింటిలో చేప పిల్లల్ని వదలడం లేదు. గత యేడాది జిల్లాలో 482 చెరువుల్లో ఉచిత చేపపిల్లల్ని వదిలారు. మ త్స్య సంపద ఉత్పత్తి భారీగా పెంచడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తు న్నారు. గత యేడాది కన్నా 276 చెరువుల్లో అధికంగా ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. చేప పిల్లల పంపిణీకి ముందు చెరు వుల స్థితిగతుల్ని పరిశీలించి, మత్స్య సంపద పెంపకానికి అనువుగా ఉం డేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్య కారులు కోరుతున్నారు. పలు చెరువుల్లో పూడిక పెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీనికి తోడు లోపల పిచ్చి మొక్కలు, ముళ్ల కంప చెట్లు దట్టంగా పెరిగి వేటకు అంతరాయం ఏర్పడుతోంది. పలు చెరువుల్లో చేపల వేటకు పరిస్థితులు అనువుగా లేకపోవడం వల్ల వలలు కంపలకు చిక్కుకుపోవడం తదితర సమస్యలను మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉపా ధి హామీ పథకం కింద కూలీల ద్వారా ముళ్ల కంప చెట్లు తొలగించడం, పూడికతీతకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్న అభి ప్రాయాలను మత్స్య కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను 1,58,44,908 ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని మత్స్య శాఖ నిర్ణయించింది. ఇందులో 1,11,48,758 చిన్న రకం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ధేశించారు. అ దేవిధంగా 46,96,150 పెద్దరకం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చే యడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో చేప పిల్లల పెంపకానికి 758 చెరువులను ఎంపిక చేశారు. ఇందులో చిన్నర కం చేప పిల్లల పెంపకానికి 571 చెరువులు, పెద్ద రకం చేప పిల్లల పెం పకానికి 187 చెరువులను ప్రాథమికంగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు.

సకాలంలో పంపిణీ....

ప్రస్తుత యేడాది సకాలంలో ఉచిత చేప పిల్లల విత్తనాల పంపిణీకి అ ధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అవసరమైన విత్తనాల  కో సం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారన్న అభిప్రాయాలున్నాయి. గత యే డాది టెండర్లలో అవకతవకలు చోటుచేసుకోవడంతో మత్స్య శాఖ ద్వారానే చేప పిల్లల పంపిణీని జరిపారు. ప్రస్తుతం టెండర్లు నిర్వహించి ఎంపికైన  కాంట్రాక్టర్‌ ద్వారా అనుకున్న సమయానికి విత్తనాలు తెప్పించడానికి ప్ర యత్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న పరిమితమైన నీటి వనరులలో గరిష్ట చేప ల ఉత్పత్తి జరపడం లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.

గత యేడాది ఇలా...

జిల్లాలోని పలు చెరువుల్లో గత యేడాది సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలు, రొయ్య పిల్లను విడుదల చేశారు. 2020-21 సంవత్సరానికి గానూ జిల్లాలో 617 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై సుమారు రూ. 1.30 కోట్ల విలువ గల  138 లక్షల చేప పిల్లలను ప్రభు త్వం ఉచితంగా వదిలింది. వీటితో పాటు ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌లో 6.09 లక్షలు, స్తంబంపల్లిలోని కొంపల్లి చెరువలో 50 వేలు, నర్సింలపల్లి రోళ్ల వాగు ప్రాజెక్టులో 1.21 లక్షల రొయ్య పిల్లలను ఉచితంగా వదిలారు. జిల్లా లో 2020-21 సంవత్సరానికి గానూ 7,740 టన్నుల చేపలు, 360 టన్నుల రొయ్యల ఉత్పత్తి లక్ష్యంగా మత్స్య శాఖ పనులు చేపట్టింది. గత వర్షాకా లం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కురిసిన వరుస వర్షాల వల్ల మత్స్య సంప దకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల చేపల పెంపకం చేస్తున్న చెరు వుల్లో నీరు నిండుకుంది. పలు చెరువుల నీరు మత్తడి దూకి పారుతుం డడం, నీరు పొంగి పొర్లి రోడ్ల పైకి వస్తుండడం వంటి సంఘటనలు జరిగాయి. గత సీజన్‌లో జిల్లాలో కురిసిన వర్షాలు, వచ్చిన వరదల వల్ల సుమారు వంద చెరువుల్లో సుమారు 25 టన్నుల చేపలు, 10 టన్నుల రొయ్యలు కొట్టుకవెళ్లడం, చనిపోవడం వల్ల మత్స్య కారులు నష్టాల పాలైనట్లు అంచనాలున్నాయి. జిల్లాలో 2021-22 సంవత్సరానికి గాను 8,304 టన్నుల చేపలు, 437 క్వింటాళ్ల రొయ్యలు ఉత్పత్తి లక్ష్యానికి గానూ గత మార్చి చివరి నాటికి 7,296 టన్నుల చేపలు, 196 క్వింటాళ్ల రొయ్యలు ఉత్పత్తి జరిగింది.

మత్స్య కారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

- కల్లెడ గంగాధర్‌, జిల్లా మత్స్య కార్మిక సంఘం నాయకులు

ప్రభుత్వం మత్స్య కారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేయాలి. ఇందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. పలు సందర్భాల్లో నష్టా ల పాలవుతున్న మత్స్యకారులను సర్కారు ఆదుకోవాలి.

సకాలంలో చేప పిల్లల్ని పంపిణీ చేయాలి

- మర్రి నర్సయ్య, మత్స్య కార్మిక సంఘ నాయకులు, మెట్‌పల్లి

జిల్లాలో సకాలంలో చేప పిల్లల్ని పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అన్ని విధాలుగా వసతులు గల చెరువులను ఎంపిక చేయాలి. అర్హులైన మత్స్యకారులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలి. కిసా న్‌ క్రెడిట్‌ కార్డులను ఇప్పించాలి.


ఉచిత చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా చేపడుతాం

- దేవేందర్‌, ఏడీ, జిల్లా మత్స్యశాఖ, జగిత్యాల

జిల్లా వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను పకడ్బందీగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతాము. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా దృష్టి సారించాము. ఇప్పటికే జిల్లాలో చేప పిల్లల పంపిణీ లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగింది.


Read more