తొలి అడుగు కరీంనగర్‌ నుంచే..

ABN , First Publish Date - 2022-09-30T05:21:08+05:30 IST

కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్‌ పేరు మరోసారి ప్రత్యేకంగా తెరపైకి వస్తున్నది. దసరా రోజే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ పేరును అదే రోజు వెల్లడిస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

తొలి అడుగు కరీంనగర్‌ నుంచే..

- జాతీయ పార్టీ ప్రకటన తర్వాత  ఇక్కడే మొట్టమొదటి బహిరంగ సభ

 సెంటిమెంట్‌ను కొనసాగించనున్న కేసీఆర్‌ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్‌ పేరు మరోసారి ప్రత్యేకంగా తెరపైకి వస్తున్నది. దసరా రోజే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ పేరును అదే రోజు వెల్లడిస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌లో జాతీయ పార్టీ ఏర్పాటైన తర్వాత తొలి భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఈ సమావేశంలోనే పార్టీ జెండా, ఏజెండాలను ప్రజలముందు ఉంచుతారని తెలిసింది. జిల్లాలో జరిగే బహిరంగ సభ అనంతరం రాష్ట్రంలోని ఒకటిరెండు చోట్ల సభలను నిర్వహిస్తారని, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలను ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని పార్టీవర్గాలు అంటున్నాయి. 


 నాడు సింహగర్జన సభతో..


తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్తావనగా పేర్కొనే సింహగర్జన సభను కరీంనగర్‌లో నిర్వహించిన నాటి నుంచి ఈ జిల్లా  కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లాగా మారింది. ఇక్కడ నుంచే ఆయన నిరవధిక నిరాహార దీక్ష కోసం తరలివెళ్తుండగా అల్గునూరు చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం అటు తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమకాలంలో రాజకీయ మేఽథోమధన సదస్సు, సకల జనుల సమ్మె ప్రారంభ సమావేశం కూడా ఈ జిల్లాలోనే నిర్వహించారు. ఎంపీగా కరీంనగర్‌ నియోజకవర్గం నుంచే గెలుపొంది జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన కేసీఆర్‌ కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలను జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ పథకాలే ఇప్పుడు కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో కలిసివచ్చే అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే తన సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌లోనే జాతీయ పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ సమావేశానికి పలువురు జాతీయ నాయకులను, ప్రాంతీయపార్టీల నాయకులను ఆహ్వానిస్తారని, దేశ రాజకీయాల్లో ఈ సభ కీలక దశగా నిలుస్తుందని భావిస్తున్నారు.  కేసీఆర్‌తోపాటు జిల్లా నుంచి ఎంపీగా పోటీచేసిన బి వినోద్‌కుమార్‌ కూడా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించనున్నారు. ఎంపీగా పనిచేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమకాలంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో, ఆ తర్వాత జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రాజెక్టులకు, పథకాలకు అనుమతులు, నిధులు సాధించడంలో వినోద్‌కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. 


జాతీయ స్థాయి సమన్వయకర్తల్లో జిల్లా నాయకులకు అవకాశం


జాతీయస్థాయిలో నియమించనున్న రాజకీయ సమన్వయకర్తలలో జిల్లాకు పెద్దపీట వేసే అవకాశమున్నదని పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక్కడి నుంచి కనీసం ఇద్దరికి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో స్పష్టత రాకముందు నుంచే కేసీఆర్‌ మళ్లీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన గానీ, ఆయనకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న వినోద్‌కుమార్‌గానీ ఈ నియోజకవర్గం నుంచే పోటీచేసే అవకాశాలున్నాయి. దసరా రోజున  మధ్యాహ్నం 1.19 నిమిషాలకు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆ సమావేశంపై ఉంది. ఆ సమావేశం తర్వాత మాత్రం  దృష్టి కరీంనగర్‌ జిల్లా కేంద్రంవైపే ఉండే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-30T05:21:08+05:30 IST