దేశం సూపర్‌ పవర్‌గా ఎదగాలి

ABN , First Publish Date - 2022-08-17T06:25:49+05:30 IST

భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాల నాటికి ఇండియా సూపర్‌ పవర్‌గా ఎదగాలని, ఇందుకోసం ప్రతి పౌరుడు కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

దేశం సూపర్‌ పవర్‌గా ఎదగాలి
జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌

- దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు కృషి చేయాలి

- మహాత్మా గాంధీ చరిత్ర నేటి తరానికి తెలియాలి

- ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

- రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 16: భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాల నాటికి ఇండియా సూపర్‌ పవర్‌గా ఎదగాలని, ఇందుకోసం ప్రతి పౌరుడు కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళవారం తెలంగాణచౌక్‌ వద్ద నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో విద్యార్థులు, నగరవాసులతో కలిసి వారు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారన్నారు. నేటి తరానికి స్వాతంత్య్ర ఉద్యమం గురించి స్పష్టమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట యోధులు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ చరిత్రను నేటితరానికి తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మహాత్మాగాంధీ సినిమా ప్రదర్శిస్తున్నామన్నారు. సూపర్‌ పవర్‌ అంటే అమెరికా, రష్యా దేశాలు అని, ఆర్మీ, అణ్వాస్ర్తాలు, జెట్‌ విమానాలు, బాంబర్స్‌ ఉంటేనే సూపర్‌ పవర్‌ దేశాలు అని మేము చదువుకున్నామని, రాబోయే 25 సంవత్సరాల వరకు భారతదేశం సూపర్‌ సాఫ్ట్‌ పవర్‌ కావాలన్నారు. సూపర్‌ సాఫ్ట్‌ పవర్‌ అంటే విద్యా, విజ్ఞానం, వ్యవసాయం, ఇండస్ర్టీస్‌ అన్నారు. భారతదేశానికి సూపర్‌ సాఫ్ట్‌ పవర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. 8 సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి సాధించి యావత్‌ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దేద్దుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. దేశంలో కొంత మంది మతోన్మాదం విచ్చలవిడితనాన్ని పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ వై సునీల్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. 

Read more