‘పట్టణ ప్రగతి’లో నగరాన్ని ఆధునీకరించాలి

ABN , First Publish Date - 2022-06-12T05:14:40+05:30 IST

పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగరాన్ని అన్ని హంగులతో ఆధునీకరించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

‘పట్టణ ప్రగతి’లో నగరాన్ని ఆధునీకరించాలి
బ్యాంకు కాలనీ వద్ద నూతన సబ్‌ స్టేషన్‌ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- విద్యుత్‌ సమస్యలన్నిటిని పరిష్కరించాలి 

- మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 11: పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగరాన్ని అన్ని హంగులతో ఆధునీకరించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ‘పవర్‌ డే’ను పురస్కరించుకొని 40వ డివిజన్‌ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన 33/11కెవి విద్యుత్‌ ఉపకేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆ డివిజన్‌లో పర్యటించారు. నిరుపయోగంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను పరిశీలించి వెంటనే వాటిని తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లూస్‌ లైన్లు, హైటెన్షన్‌ లైన్లను పరిశీలించి, వెంటనే ఇలాంటి సమస్యలన్నిటిని పరిష్కరించాలని విద్యుత్‌, నగరపాలక సంస్థ అధికారులను మంత్రి ఆదేశించారు. డివిజన్‌లోని పార్కును  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పట్టణ ప్రగతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.  ప్రజల భాగస్వామ్యంతో కరీంనగర్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మారుతుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి భావితరాలకు సుందరమైన నగరాన్ని అందించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు. నగరంలో లోవోల్టేజీ వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నగరంతోపాటు, పరిసర గ్రామాల్లో పన్నెండు 33/11 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు,  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, డివిజన్‌ కార్పొరేటర్‌ భూమాగౌడ్‌ పాల్గొన్నారు.


 దళితుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం


కరీంనగర్‌ రూరల్‌: దళితుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో తహేర్‌ కొండాపూర్‌ గ్రామానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకంతో డ్రైవర్లు, క్లీనర్లుగా ఉన్న వారు సొంత వాహనాలకు యజమానులుగా మారారన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యూనిట్లను అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంపత్‌కుమార్‌, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్‌ ఎంపీపీ వేల్పుల నారాయణ, తహేర్‌ కొండాపూర్‌ సర్పంచ్‌ మమత, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more