అరకొరగా పాఠ్యపుస్తకాలు

ABN , First Publish Date - 2022-06-11T05:47:30+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి.

అరకొరగా పాఠ్యపుస్తకాలు
జిల్లాకు చేరిన పాఠ్య పుస్తకాలు

- మరో రెండు రోజుల్లో పాఠశాలల పునఃప్రారంభం

- యూనిఫామ్స్‌ ఆర్డర్‌ ఇవ్వని ప్రభుత్వం

- విద్యార్థులకు తప్పని ఇక్కట్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు కూడా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ చేరకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.  

అంచనా వేసినా..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి 3,34,000 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటాయని అంచనా వేశారు. ఇప్పటివరకు జిల్లాకు కేవలం 48,800 పుస్తకాలు చేరాయి. ఒకటి, రెండు రోజుల్లో మరో 30వేలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిస్తుండడంతో ఆదిలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలో ఒకే పుస్తకంగా ముద్రిస్తున్నారు. ఈ పుస్తకాలను పార్ట్‌-1, 2గా విభజించారు. పార్ట్‌-1లో సగం పాఠాలు, పార్ట్‌-2లో మిగతా పాఠాలను ముద్రిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులు అందరికి కామన్‌ కావడంతో ఎప్పటిలాగానే ఒకే పుస్తకంగా ముద్రిస్తున్నారు. మీడియంల వారీగా ముద్రించడం వల్ల ఇప్పటివరకు తెలుగు మీడియం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలుగు, ఇంగ్లీష్‌ వెర్షన్లను కలిపి ముద్రిస్తున్నారు. 9,10 తరగతులు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం వేర్వేరుగా పాఠ్యపుస్తకాలను ముద్రించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులకు పుస్తకాలు అందే పరిస్థితి కనబడడం లేదు. 

వారం రోజులుగా ‘బడిబాట’..

ఈనెల13వ తేదీ నుంచి పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వారం రోజుల నుంచి బడి బాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా పాఠశాలల ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ను ప్రభుత్వం చేరవేస్తుంది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలకు కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ చేరలేదు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 98,848 మంది విద్యార్థులు ఉన్నారు. 365 ప్రభుత్వ పాఠశాలల్లో 36,244 మంది విద్యార్థులు చదువుతున్నారు. 42 కస్తూర్బా, మోడల్‌స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో 15,727 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన చేయనున్నారు. తెలుగు మీడియం చదివే వారికి తెలుగులోనే విద్యా బోధన చేయనున్నారు. పాఠశాలల ప్రారంభం నాటికే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫామ్స్‌ అందజేసేందుకు క్లాత్‌ను తెప్పించాల్సి ఉంటుంది. వాటిని కుట్టించేందుకు ఆర్డర్లు ఇవ్వాలి. వాళ్లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకుని పంపించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు క్లాత్‌ను ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం యూనిఫామ్స్‌ ఇవ్వలేదు. ఈసారి కరోనా పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిసినా కూడా యూనిఫామ్స్‌ కుట్టించేందుకు ఆర్డర్‌ ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Read more