జీవన ప్రమాణాలపై సర్వే

ABN , First Publish Date - 2022-09-29T06:02:51+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే అభివృద్ధి పథకాల రూపకల్పన, విధానపరమైన నిర్ణయాలకు కచ్ఛితమైన సమాచారాన్ని అందించే ఆర్థిక గణాంకాల సర్వే జిల్లాలో మొదలైంది. కేంద్ర ప్రభుత్వం 1958 సంవత్సరం నుంచి గణాంకాల సర్వే నిర్వహిస్తోంది.

జీవన ప్రమాణాలపై సర్వే
సర్వే చేస్తున్న అధికారులు

- జిల్లాలో 8 గ్రామాలు, రెండు పట్టణాల్లో వివరాల సేకరణ 

- నివేదిక ఆధారంగా అభివృద్ధి పథకాల రూపకల్పన

- 2023 జూన్‌ 30 వరకు సర్వే 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే అభివృద్ధి పథకాల రూపకల్పన, విధానపరమైన నిర్ణయాలకు కచ్ఛితమైన సమాచారాన్ని అందించే ఆర్థిక గణాంకాల సర్వే జిల్లాలో మొదలైంది. కేంద్ర ప్రభుత్వం  1958 సంవత్సరం నుంచి గణాంకాల సర్వే నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే బృందం ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తుంది. ఈ సర్వే 2023 జూన్‌ 30 వరకు చేపట్టనున్నారు. సామాజిక ఆర్థిక సర్వేలో ఈ సారి ఆయూష్‌ వైద్యంపై కూడా వివరాలను సేకరిస్తున్నారు. 

బ్లాక్‌లవారీగా ప్రాంతాల ఎంపిక 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్లాక్‌లవారీగా ప్రాంతాలను ఎంపిక చేసి సర్వే చేయడానికి 8 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 8 ప్రాంతాల్లో శాంపిల్‌ సర్వే చేపట్టనున్నారు. గ్రామాలకు సంబంధించి తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, తాడూరు, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, ముస్తాబాద్‌ మండలం బదనకల్‌, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం,  బండలింగంపల్లి, రుద్రంగి మండలంలో రుద్రంగి, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామాల్లో సర్వే చేయనున్నారు.  కుటుంబంలో వినిమయ ఖర్చులు, ఆరోగ్యం, విద్య, ఖర్చులతోపాటు అసంఘటిత రంగంలో వ్యాపార సంస్థల ఆదాయం, వ్యయాల వివరాలు, వాణిజ్య సేవా రంగాలు, వస్తువుల తయారీ, రైతుల స్థితిగతులు, భూమి, పశు సంపద, రుణాలు, పెట్టుబడులు, తాగునీరు, పారిశుధ్యం, గృహవసతి, పర్యాటకం, ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్‌ సేవలు, కంప్యూటర్‌ వినియోగం, ఐదేళ్ల్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల జనన నమోదు, నిష్పత్తి, ప్రజారవాణాతోపాటు అందుబాటులో ఉన్న వివరాలను సేకరిస్తారు. వయోజనుల సంఖ్యతోపాటు విద్య, ఉపాధి శిక్షణకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. సేకరించిన ప్రతీ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈసారి కరోనా సమయంలో ప్రజలు అలోపతి వైద్యంతోపాటు ఆయుర్వేదం వైపు కూడా మొగ్గు చూపారు. ఇళ్లలో దొరికే వస్తువులనే ఉపయోగించుకున్నారు. పాత పద్ధతులను వాడారు. ఆయూష్‌ సేవలపై సర్వేలో పొందుపర్చారు. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా, నేచురోపతి వంటి  వివరాలను సేకరిస్తున్నారు. అదే విధంగా కరోనా సమయంలో మందుల ఖర్చుల వివరాలు  తెలుసుకుంటున్నారు. ప్రజల జీవనశైలిపై పూర్తిగా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దాని ప్రకారం ప్రభుత్వాలు వివిధ పథకాల రూపకల్పనపై దృష్టి పెట్టనున్నాయి. కరోనా సమయంలో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం జిల్లాలో  సర్వే  వేగంగా కొనసాగుతోంది.  


వివరాలు గోప్యంగా ఉంచుతాం

- పీబీ శ్రీనివాసాచారి, జిల్లా ప్రణాళికా అధికారి 

ఐదేళ్లకోసారి నిర్వహించే ఆర్థిక గణాంకాల సర్వే జిల్లాలో 8 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడలోని 8 ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రజల జీవన వ్యయాలు, ప్రమాణాలు, ఆయుష్‌ సేవలపై ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే కొనసాగుతుంది. వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం. ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలు, బడ్జెట్‌ల కేటాయింపునకు ఆర్థిక గణాంకాల సర్వే ఉపయోగపడుతుంది. సర్వేకు ప్రజలు సహకరించాలి.


Read more