దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

ABN , First Publish Date - 2022-09-30T05:23:30+05:30 IST

ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి అన్నారు. గురువారం సేవాపక్షంలో భాగంగా కరీంనగర్‌లో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి రాణిరుద్రమదేవి

- రైతుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం పటిష్టచర్యలు 

- ధరణితో ప్రశాంతత కరువు 

- బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి రాణిరుద్రమదేవి 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 29: ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి అన్నారు. గురువారం సేవాపక్షంలో భాగంగా కరీంనగర్‌లో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం భారత్‌ దశ దిశను మార్చిందని, మోదీ పాలనలో మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.  మోదీ సర్కార్‌ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించిందని అన్నారు. పేద, మధ్య తరహా రైతులకు ప్రతియేటా మూలధన పెట్టుబడి కోసం కిసాన్‌ సమ్మాన్‌నిధి యోజనతో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తోందన్నారు. రైతులపై ఆర్థికభారం పడకూడదని లక్షల కోట్లను ఖర్చు చేసి సబ్సిడీపై ఎరువులను అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు అందకుండా కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని రుద్రమదేవి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ స్వార్థ రాజకీయాల కోసం రైతాంగాన్ని ఆగం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాష్ర్టాల వ్యవసాయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, ఆయా రాష్ట్రాల వ్యవసాయ పాలసీ ప్రకారం నడుచుకుంటాయని అన్నారు. తెలంగాణాలో వ్యవసాయ పాలసీ ఉందా అని ఆమె ప్రశ్నించారు. రైతుబంధు ఒక్కటే సర్వరోగ నివారిణి అన్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరటాల శివరామయ్య, కిసాన్‌మోర్చా కార్యదర్శి కె మహిపాల్‌రెడ్డి ప్రపసంగించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణ, కిసాన్‌ మోర్చా రాష్ట్ర సహకార సెల్‌ కన్వీనర్‌ మోతె గంగారెడ్డి పాల్గొన్నారు. 


Read more